Ponguleti Srinivas Reddy | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): అబద్ధాన్ని ఒప్పుకోవాలంటే ధైర్యం కావాలి! అబద్ధాన్ని కప్పి పుచ్చుకోవాలంటే లౌక్యం కావాలి!! ఈ రెండూ కొరవడినప్పుడు ఒక అబద్ధాన్ని దాచేందుకు వంద అబద్ధాలు ఆడాల్సి వస్తది. రాష్ట్రంలో ప్రభుత్వ భూములే కాదు.. చివరికి అమాయక సామాన్యుల భూములపైనా కన్నేసిన పొంగులేటి కుటుంబ భూ బాగోతాలు.. దౌర్జన్యాలను బీఆర్ఎస్ బట్టబయలు చేస్తుండటంతో మంత్రి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శాసనసభా వేదికగా అడ్డంగా దొరుకడమే కాదు.. నాదర్గుల్ భూములతోనూ ఆయన భూ దాహం పొంగిపొర్లిన తీరు ప్రజలకు తెలువడంతో ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారు. నిన్నటిదాకా సీఎం రేవంత్ నోటి వెంటనే బూతు పురాణం వస్తుందనుకుంటే తాజాగా మంత్రి పొంగులేటి సైతం ఆయన బాటలోనే నడిచారు.
భూ కుంభకోణాలను కప్పి పుచ్చుకొనేందుకు బుధవారం సచివాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో మంత్రి పొంగులేటి అబద్ధాల వరదకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అంతేకాదు.. నాదర్గుల్ గుట్టును బయటకు తీసిన ‘నమస్తే తెలంగాణ’పైనా ఆయన అవాకులు చెవాకులు పేలారు. అయినా రూ.7 వేల కోట్ల విలువైన ప్రజల భూములను కాపాడే యజ్ఞంలో భాగంగా ఇప్పటికే అనేక కథనాలు ప్రచురించిన ‘నమస్తే’కు తాజాగా మంత్రి పొంగులేటి వ్యాఖ్యల్లోని డొల్లతనం, తప్పించుకునే ప్రయత్నాలు, కప్పిపుచ్చుకొనేందుకు పడిన తంటాలను కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉన్నది. అందుకే ఆయన చేసిన వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉన్న వాస్తవాలను కౌంటర్ రూపంలో ఇస్తున్నాం.
పొంగులేటి వ్యాఖ్యలు: రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ సర్వేనంబర్ 613లోని 373.22 ఎకరాల భూములకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలోనే రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2014లో ఒమెగా, యునైటెడ్, ఆల్ఫా కంపెనీల పేరిట రిజిస్ట్రేషన్లు అయ్యాయి. అలాంటప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం సంబంధం?
కౌంటర్: ఈ భూముల దందా మొదలైందే కాంగ్రెస్ ప్రభుత్వంలో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 2006లో తొలిసారిగా ఈ భూముల రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. శివరాజ్ బహదూర్ వారసులంటూ కొంతమందితో కరీం అల్లావుద్దీన్ అనే వ్యక్తికి 266.33 ఎకరాల భూములను ఏజీపీఏ చేశారు. ఆ ఏజీపీఏ ఆధారంగానే ప్రైవేట్ వ్యక్తులు పూర్తిగా ప్రభుత్వానికి చెందిన ఈ భూములపై న్యాయ స్థానాల్లో పిటిషన్లు వేస్తున్నారు. అసలు 2006లో ఏజీపీఏ జరుగకుంటే రూ.7 వేల కోట్ల విలువైన ఈ భూములపై వివాదమే లేదు. ఇక 2014లో ఏజీపీఏ చేసుకున్న కరీం అల్లావుద్దీన్ ఒమెగా, యునైటెడ్, ఆల్ఫా కంపెనీలకు 50 ఎకరాల చొప్పున సేల్‌డీడ్ చేసేందుకు డాక్యుమెంట్లు తయారు చేసుకుంటే ఆ సమయంలో రిజిస్ట్రేషన్లు జరుగలేదు. కానీ ఉమ్మడి ఏపీలో ఏపీఐఐసీ 2013లో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లపై 2015లో ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దాన్ని ఆసరాగా చేసుకొని 2014 నుంచి పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంట్లను 2016లో క్లియర్ చేయించుకున్నారు.
పొంగులేటి వ్యాఖ్యలు: నాదర్గుల్ భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా బీఆర్ఎస్ హయాంలోనే 2016లో మ్యుటేషన్ జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025లో సుప్రీంకోర్టులో కౌంటర్ వేసి ప్రభుత్వ భూములను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నది.
కౌంటర్: నాదర్గుల్ భూములపై 2023, డిసెంబర్ 7న ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క కోర్టులోనూ ఒక్క పిటిషన్ కూడా వేయలేదు. 2016లో మూడు ప్రైవేట్ కంపెనీలు రంగారెడ్డి కోర్టుకు వెళ్లి వాళ్లకు అనుకూలంగా తీర్పుతో మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే అప్పటి సరూర్‌నగర్ ఎమ్మార్వో మ్యుటేషన్ ఉత్తర్వులిచ్చారు. కానీ నాలాకు దరఖాస్తు చేసుకోగానే 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్నందున నాలా అనుమతి ఇవ్వబోమంటూ 2016లోనే అప్పటి కందుకూరు ఆర్డీవో తిరస్కరించారు. దానిపై సదరు ప్రైవేట్ కంపెనీలు హైకోర్టును ఆశ్రయిస్తే కోర్టు వారి పిటిషన్లను తిరస్కరించి ఆర్డీవో నిర్ణయాన్ని సమర్థించింది.
ఆ తీర్పులోనే స్పష్టంగా రంగారెడ్డి కోర్టు డిక్రీ ఆధారంగా సరూర్‌నగర్ ఎమ్మార్వో మ్యుటేషన్ ఉత్తర్వులు ఇచ్చారని, కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందనే భయంతో సదరు అధికారి అలా చేశారని న్యాయస్థానం స్పష్టం చేసింది. అదే సమయంలో ఆర్డీవో నాలా అనుమతిని తిరస్కరించడం సరైన నిర్ణయంగా అభివర్ణించింది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం హైకోర్టులో పోరాడి ప్రైవేట్ కంపెనీలకు వ్యతిరేకంగా తీర్పు వచ్చేలా వాదనలు వినిపించింది. ఇప్పటికీ ఆ కోర్టు ఉత్తర్వులే అమల్లో ఉన్నాయి. తదుపరి వాటిపైనే తదుపరి ప్రైవేట్ కంపెనీలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే దానిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయ పోరాటం చేసింది. ఇప్పుడున్న కాంగ్రెస్ హయాంలో అధికారులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. కీలక అంశమేంటంటే.. 2025, మార్చిలో కందుకూరు ఆర్డీవో సుప్రీంకోర్టులో వేసిన కౌంటర్ పిటిషన్‌కు సంబంధించిన నివేదిక బీఆర్ఎస్ హయాంలోనే రూపొందించారు. అంటే గత ప్రభుత్వ వాదనలే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వినిపిస్తున్నది.
పొంగులేటి వ్యాఖ్యలు: నాదర్గుల్ భూముల్లో ప్రైవేట్ కంపెనీలు బీఆర్ఎస్ హయాంలోనే చుట్టూ ఐరన్ షీట్లు వేశాయి. అందుకు సంబంధించిన గూగుల్ మ్యాపులు కూడా ఉన్నాయి. మీ హయాంలోనే 373.22 ఎకరాల చుట్టూ రేకులు కట్టించారు. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం మీద నింద మోపుతారా?
కౌంటర్: వాస్తవానికి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయంటూ ప్రైవేట్ కంపెనీలతో పాటు శివరాజ్ బహదూర్ వారసులతో ఏజీపీఏ చేయించుకున్న కరీం అల్లావుద్దీన్ బీఆర్ఎస్ హయాంలో అనేకసార్లు భూముల మీదికి వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడ వ్యవసాయం చేసుకుంటున్న నాదర్గుల్ రైతులు వారి ఆటలు సాగనివ్వలేదు. అందుకే నెమ్మదిగా రేకులు వేయడం ప్రారంభించారేగానీ రైతులను వాళ్ల భూముల్లోకి పోకుండా అడ్డుకోలేదు. దీంతో విషయం బయటకు రాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2023, డిసెంబర్ 7న అధికారంలోకి వస్తే సరిగ్గా వారం రోజుల్లోనే అంటే 15.12.2023 రోజున ఏజీపీఏ చేయించుకున్న కరీం అల్లావుద్దీన్ రాచకొండ కమిషనర్‌కు నాదర్గుల్ భూములపై తమకు కోర్టు ఇన్‌జంక్షన్ ఇచ్చినందున స్వాధీనం చేసుకునేందుకు పోలీసు రక్షణ ఇవ్వాలని కోరారు. కేవలం మూడు రోజుల్లోనే రాచకొండ కమిషనర్ పోలీసు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు (సీ నంబర్. 1517/సీసీఆర్బీ/ఆర్సీకే/2023, తేది: 18.12.2023) జారీ చేశారు.
ఇందుకు అనుగుణంగా వందలాది మంది పోలీసుల వలయం మధ్య ప్రైవేట్ కంపెనీలు 373.22 ఎకరాల చుట్టూ బ్లూషీట్స్ వేసి రైతులను అందులోకి పోకుండా 30-50 మంది బౌన్సర్లను ఏర్పాటు చేశాయి. చుట్టూ సీసీ కెమెరాలు పెట్టాయి. తర్వాత ఆ కంపెనీలు కొందరు రైతులను బెదిరించి ఐదారు లక్షలు ఇచ్చి అనధికారిక ఒప్పందాలు చేసుకున్నాయి. మిగిలిన రైతులను బెదిరించి అక్కడికి రాకుండా తరిమేశాయి. పోలీసులు సైతం రైతులను బెదిరించడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలువక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఆతర్వాత ‘నమస్తే తెలంగాణ’ రైతులను విచారించడంతో కొందరు ధైర్యంగా ముందుకొచ్చి తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్, హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. ‘నమస్తే తెలంగాణ’ గత నెల 28న తెర వెనుక ఉన్న పెద్దల బాగోతాన్ని వెలుగులోకి తీసుకురావడంతో ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఉలిక్కిపడుతున్నారు.
పొంగులేటి వ్యాఖ్యలు: నాదర్గుల్ భూములకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితాలో ఉంచితే దానికి చిన్న ఫుల్స్టాప్, కామా కూడా పెట్టకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధిత జాబితాలో కొనసాగించింది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంపౌండ్ వాల్ కోసం ఆ కంపెనీ దరఖాస్తు చేసుకున్న మాట వాస్తవం. నాదర్గుల్ భూములపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
కౌంటర్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూముల్ని నిషేధిత జాబితాలో ఉంచి కాపాడిందని సాక్షాత్తూ తాజా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అంగీకరించారు. తమ ప్రభుత్వం కామా, ఫుల్స్టాప్ కూడా పెట్టలేదన్నదీ వాస్తవమే. ఆయన మాటల ప్రకారం 373.22 ఎకరాల భూములను కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టమైంది. మరి.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు అధికారికంగా ఈ భూములపై ఎవరూ బయటికి రాలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వారం రోజులకే ఏజీపీఏ చేయించుకున్న కరీం అల్లావుద్దీన్ పోలీసు రక్షణతో భూముల మీదికి వెళ్లారు. మరి ఇప్పుడు ఆ భూములు ఏక్యూ స్వేర్ రియల్టర్స్ భూములుగా చెప్పుకొంటూ కాంపౌండ్ వాల్ కోసం బడంగ్‌పేట సర్కిల్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. అంటే కోర్టు వివాదాల్లో ఉన్నప్పుడు భూములు ఏక్యూ స్వేర్ రియల్టర్స్ చేతికి ఎలా వెళ్లాయి? కోర్టు వివాదంలో ఉండగా ఆ కంపెనీ అధికారికంగా ఎలా దరఖాస్తు చేసుకున్నది? కోర్టు వివాదాల్లోనే ఉండగా కాంపౌండ్ వాల్ నిర్మాణం ఎలా జరిగింది? బీఆర్ఎస్ హయాంలో రేకులు వేస్తేనే పెద్ద పెద్ద ఫొటోలు చూపిస్తూ ఆరోపణలు చేసిన రెవెన్యూ శాఖ మంత్రి ఇప్పుడు కాంపౌండ్ వాల్ పెడితే ఏం చేస్తున్నారు? అసలు చర్యలు తీసుకున్నారా? ఇంతకీ అవి ప్రభుత్వ భూములేనని చెప్తున్న ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ప్రైవేట్ కంపెనీలను అక్కడి నుంచి ఎందుకు తరిమేయడం లేదు? రైతులను రానివ్వకుండా బౌన్సర్లతో అరాచకం సృష్టిస్తున్నా ప్రేక్షక పాత్ర పోషించడమే కాదు.. పరోక్షంగా పోలీసులతో బెదిరింపులకు ఎందుకు పాల్పడుతున్నది? నిజంగా మంత్రి పొంగులేటికి ప్రైవేట్ కంపెనీలతో సంబంధం లేకపోతే హైడ్రాతో రాత్రికి రాత్రి రేకులు, ప్రహరీని ఎందుకు నేలమట్టం చేయడం లేదు?
పొంగులేటి వ్యాఖ్యలు: కొత్వాల్‌గూడ క్రషర్కు సంబంధించి అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వంపై హరీశ్‌రావు పచ్చి అబద్ధాలు మాట్లాడారు. కొత్వాల్‌గూడ క్రషర్కు రాఘవ కన్స్ట్రక్షన్స్కు సంబంధం ఏమిటి? ఓఆర్ఆర్ రాకముందు నుంచి అంటే 2006-07 నుంచి తిరుమల మెటల్ ఇండస్ట్రీస్ అక్కడ క్రషర్ నడిపిస్తున్నది. వారు కట్ చేసిన రాయిని వారి నుంచి రాఘవ కన్స్ట్రక్షన్స్ కొనుగోలు చేస్తున్నది. ఈ మాత్రందానికే ఆ క్రషర్‌తో రాఘవ కన్స్ట్రక్షన్స్కు సంబంధం ఏమిటి?
కౌంటర్: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఓవైపు కొత్వాల్‌గూడలోని క్రషర్‌తో రాఘవ కన్స్ట్రక్షన్స్కు ఎలాంటి సంబంధం లేదని చెప్తూనే మరోవైపు ఆ కంపెనీతో వ్యాపార లావాదేవీలు నడిపిస్తున్నట్టు అంగీకరించారు. రోడ్ల నిర్మాణానికి అవసరమైన క్రషర్‌ను తిరుమల క్రషర్ ఇండస్ట్రీ నుంచి రాఘవ కన్స్ట్రక్షన్స్ కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. ఆ మాత్రందానికే ఆ క్రషర్‌తో రాఘవ కన్స్ట్రక్షన్స్కు ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు. అయితే కర్నూల్లో రాఘవ కన్స్ట్రక్షన్స్ క్రషర్ ఉంటే అక్కడ పనులు పూర్తయిన తర్వాత ఆ పరికరాలను తిరుమల మెటల్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసిందని తెలిపారు. అంటే నీకు వాళ్లకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టే కదా? నీ కంపెనీ పరికరాలనే ఆ కంపెనీ కొనుగోలు చేసింది. ఆ కంపెనీ చేసిన క్రషర్‌ను మీ కంపెనీయే కొనుగోలు చేస్తున్నది. అలాంటప్పుడు ఈ రెండు కంపెనీలకు సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? ఒకవేళ ఇదే నిజమైతే మైనింగ్ శాఖ తిరుమల కంపెనీకి నోటీసు ఇవ్వకుండా రాఘవ కన్స్ట్రక్షన్స్కు నోటీసు ఎందుకిచ్చింది? అంటే మీ సొంత ప్రభుత్వమే తప్పు చేసిందా? అసెంబ్లీలోనూ సీఎం రేవంత్‌రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ తప్పు చేసిందని, అందుకే జరిమానా విధించినట్టు అంగీకరించారు.
అంటే మీ సీఎం కూడా తప్పు చెప్పారా? ఇక ఓఆర్ఆర్ రాకముందు నుంచే 2006-07 నుంచే అక్కడ తిరుమల మెటల్ ఇండస్ట్రీస్ క్రషర్ నడిపిస్తున్నట్టు తెలిపారు. అనంతరం రింగ్‌రోడ్డు వచ్చిన తర్వాత కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడున్న క్రషర్లన్నింటినీ ప్రభుత్వం తొలగించినట్టు తెలిపారు. అంటే అప్పుడు క్రషర్లను ప్రభుత్వం తొలగిస్తే ఇప్పుడు అక్కడ తిరుమల క్రషర్ ఏ విధంగా కొనసాగుతున్నది? అనుమతిలేని క్రషర్‌పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ భూమిని రైతుల నుంచి లీజుకు తీసుకొని నడిపిస్తున్నట్టు తెలిపారు. అయితే 1978లో కొత్వాల్‌గూడ గ్రామానికి చెందిన కొంతమంది పేద రైతులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో సుమారు 200 ఎకరాల భూములను అసైన్డ్ చేసింది. అప్పట్లో కొండలు, గుట్టలుగా భూమి ఉండటంతో వ్యవసాయానికి అనుకూలించదని అసైనీలు ఆ భూములను వాడుకలోకి తీసుకోలేదు. దీంతో అప్పటి ప్రభుత్వం తిరిగి పీవోటీ యాక్టు ప్రకారం ఆ భూములను 2008లో స్వాధీనం చేసుకున్నది. ఇలా ప్రభుత్వ భూమిని రైతులతో ఎలా ఒప్పందం చేసుకుంటారు? అనుమతిలేని కంపెనీతో మంత్రి కుటుంబ సభ్యుల కంపెనీ ఏ విధంగా ఆర్థిక లావాదేవీలు జరుపుతుంది? ఇక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ స్వయంగా అసెంబ్లీలో ఆ క్రషర్ డీజిల్‌తో నడుస్తున్నదని చెప్పారు. కానీ పొంగులేటి మాత్రం ఆ క్రషర్కు అన్ని అనుమతులూ ఉన్నాయని, అధికారికంగా కరెంట్ బిల్లులు కూడా చెల్లిస్తున్నదని చెప్తున్నారు. ఇందులో ఎవరిది నిజం? ఎవరిది అబద్ధం? మంత్రుల మాటలే విరుద్ధంగా ఉండటం ఏమిటి?
పొంగులేటి వ్యాఖ్యలు:
వట్టినాగులపల్లి ఇదో బాగోతం.. ఇది కేవలం షా కుటుంబానికి చెందిన పంచాయితీ. ఇందులో ఒక పార్ట్నర్కు చెందిన భూమిని ఒక కంపెనీ డెవలప్మెంట్కు తీసుకున్నది. ఆ కంపెనీ భాగస్వాముల్లో నా కొడుకు ఒకరు. కుటుంబ పంచాయితీలో భాగంగా నా కొడుకుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. విచారణలో నిజానిజాలు బయటకు వస్తాయి.
కౌంటర్: వట్టినాగులపల్లిలో సర్వే నంబర్ 245-19లో 2025 నవంబర్ 30న పొంగులేటి కుమారుడు హర్ష తన అనుచరులతో కలిసి ఆర్ధరాత్రి వీరంగం సృష్టించాడు. నాలుగు జేసీబీలు, 70 మంది బౌన్సర్లతో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిపై పల్లవీ షా ఫిర్యాదు చేయగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పొంగులేటి కుమారుడికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ (నం.2789/2025) నమోదు చేశారు. ఒకవేళ పొంగులేటి హర్ష అక్కడికి వెళ్లకపోయి ఉంటే ఆయనపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదైనట్టు? అసలు సంబంధమేలేని భూమిలోకి మంత్రి కొడుకు ఎందుకు వెళ్లినట్టు? షా కుటుంబ పంచాయితీలోకి మంత్రి కొడుకు ఎందుకు ఎంటర్ అయినట్టు? వాస్తవానికి తొలుత అసలు ఆ భూమితో తన కొడుక్కు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన పొంగులేటి ఆ తర్వాత ఆ భూమిని డెవలప్మెంట్కు తీసుకున్న వారిలో తన కొడుకు కూడా ఒక భాగస్వామి అని అంగీకరించారు.
పొంగులేటి వ్యాఖ్యలు:
నాదర్గుల్ భూములకు సంబంధించి ఉన్న కంపెనీలతో నా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. సిస్టర్ కంపెనీల్లో కూడా వాళ్లు భాగస్వాములుగా లేరు. గోడ మీద రాసిన మేఘా-శిల్పా ఇన్ఫ్రా కంపెనీలతోనూ సంబంధం లేదు. ఉన్నట్టయితే నేను ముక్కు నేలకు రాస్తా.
కౌంటర్: నాదర్గుల్ భూములపై అధికారికంగా కోహినూర్ అలియాస్ ఏక్యూ స్కేర్ రియల్టర్స్ కంపెనీ ఉన్నప్పటికీ తెర వెనుక సదరు మంత్రివర్యుల కుమారుడు ఉన్నాడనేందుకు అనేక ఆధారాలున్నాయి. కాకపోతే సాంకేతికంగా తన కుమారుడు 2023, మార్చిలోనే రాజీనామా చేసినట్టు చెప్తున్నారు. అంటే ఇప్పుడు నాదర్గుల్ భూములను చెరబట్టిన ఆ కంపెనీతో గతంలో మంత్రి కుమారుడు వ్యాపార లావాదేవీలు కొనసాగించినట్టు అంగీకరిస్తున్నారు. కోహినూర్ అలియాస్ ఏక్యూ స్కేర్ రియల్టర్స్ కంపెనీకి సిస్టర్ కంపెనీగా ఉన్న క్రిస్టల్ కంపెనీలో అదనపు డైరెక్టర్‌గా ఉన్న పొంగులేటి హర్షారెడ్డి 2023 మార్చిలో రాజీనామా చేశారు. కానీ నాదర్గుల్ భూముల గుట్టును ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తీసుకువచ్చిన తర్వాత ప్రధాన గేటుపై 31.03.2026న స్పష్టంగా ‘మేఘా-శిల్పా ఇన్ఫ్రా’ జాయింట్ డెవలప్మెంట్ అని బోర్డు రాశారు. ఇక్కడే మంత్రి కుమారుడి ఉనికి సాంకేతిక ఆధారాలతో బయటపడింది. శిల్పా ఇన్ఫ్రాటెక్ కంపెనీతో 2018 నుంచి రాఘవ కంపెనీ ఇప్పటికీ కలిసి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. శిల్పా రాఘవలో ఇప్పటికీ పొంగులేటి హర్ష డిసిగ్నేటెడ్ పార్ట్నర్గా ఉండటంతో పాటు పొంగులేటి కుటుంబానికి చెందిన పలువురు డైరెక్టర్లుగా ఉన్నారు. అంటే.. కలుగులు వేరైనా గోడ ఒకటే కదా!

పొంగులేటి వ్యాఖ్యలు: ‘నమస్తే తెలంగాణ’ మొదటి రోజు ‘ఈ జాగీర్లోకి మెగా ఎంట్రీ’ అని హెడ్‌లైన్‌తో బ్యానర్ ఐటం రాస్తారు. మళ్లీ మూడో రోజే బ్యానర్ ఐటం పొంగులేటి కబ్జా అని రాస్తారు. దీనిలో ఆంతర్యమేంది?
కౌంటర్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ‘నమస్తే తెలంగాణ’ కథనాలను చూసి జీర్ణించుకోలేక అక్కసు వెళ్లగక్కారు. అందుకే కథనాల్లోని వాస్తవాలను దాచి అబద్ధాలు చెప్పి తన కబ్జాపర్వం నుంచి తప్పించుకొనే విఫలయత్నం చేశారు. ‘నమస్తే తెలంగాణ’ మొదట మెగా ఎంట్రీ అని రాసి మూడో రోజు పొంగులేటి కబ్జా అని రాసినట్టు వ్యాఖ్యానించారు. కానీ వాస్తవానికి మెగా ఎంట్రీ అనే కథనం 01.04.2026న ప్రచురితమైంది. అంతకు నాలుగు రోజుల ముందే అంటే 28.03.2026న పొంగులేటి కండ్లు బైర్లుకమ్మేలా ‘రూ.6 వేల కోట్ల బిగ్ దందా.. ఎవని జాగీరు? – హైదరాబాద్ శివార్లలో ‘పొంగు’తున్న భూదాహం’ అని భారీ పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని చదివిన మంత్రి పొంగులేటి ప్రెస్మీట్లో మాత్రం తనకు అనుకూలంగా ఈ కథనాన్ని దాచిపెట్టి బీఆర్ఎస్ మీద బురదజల్లే ప్రయత్నం చేశారు.
ఈ ప్రశ్నలకు బదులేది?
373 ఎకరాల నాదర్గుల్ భూములు ప్రభుత్వానివే నని అవి నిషిద్ధ జాబితాలోనే ఉన్నాయని మీరే అంగీకరించారు. మరి రెవెన్యూ మంత్రిగా
ప్రహరీ ఎప్పుడు తొలగిస్తున్నారు? బౌన్సర్లను ఎప్పుడు తప్పిస్తున్నారు? భూములను ఎప్పుడు స్వాధీనం చేసుకుంటున్నారు?
కొత్వాల్‌గూడ క్రషర్స్ మైనింగ్ నిబంధనల ప్రకారమే కొనసాగుతున్నదని మీరే చెప్తున్నారు. ఉల్లంఘనలేవీ జరుగలేదని అంటున్నారు. అది ప్రభుత్వ భూమి కాదా? మరి, సర్కారీ స్థలంలో క్రషర్స్ తప్పుకాదా? క్రషర్స్‌ను ముందుపెట్టి 350 ఎకరాల ప్రభుత్వ జాగ కబ్జాకు స్కెచ్ వేసింది నిజం కాదా?
ఎర్రగా కందిన ముఖం.. ఆక్రోశాన్ని దాచలేని ఆవేశం.. హోదాను మరచిన బజారు భాష.. నేరాన్ని కప్పిపుచ్చుకోలేని దేబిరింపు.. అధికారంతో భయపెట్టే బెదిరింపు.. హాలు దద్దరిల్లిపోయే అరుపులు.. లాంగ్వేజీ బాగలేదు, బాడీ లాంగ్వేజీ బాగలేదని పక్కనున్న సహచర మంత్రులు తలదించుకొని తల్లడిల్లుతుండగా, ఆ పక్కనున్న నేతలు విస్తుపోయి చూస్తుండగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి శ్రీమాన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గారు బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. నాదర్గుల్ జాగీర్ భూములు, కొత్వాల్‌గూడ క్రషర్‌పై!
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి, జాతిపిత కేసీఆర్‌పై, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై, శాసనసభా పక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీశ్ రావుపై, నమస్తే తెలంగాణపై చిందులు తొక్కారు. ఇంతకూ వీరంతా చేసిన తప్పేమిటట అంటే ఆయన భూ కబ్జాల బండారాన్ని బద్దలు కొట్టడమే, బట్టబయలు చేయడమే!
అంతులేని ఆర్థిక నష్టం జరిగిందనే అసహనమో, అందినట్టే అందిన ఫలమేదో అందకుండా ఆవిరయ్యిందనే ఆవేదనో, ఆమాత్యులు, ప్రభుత్వం తనను ఒంటరిగా వదిలేసిందన్న అభద్రతనో మొత్తమ్మీద ఏదో పెద్ద ఫ్రస్ట్రేషనే కనిపించింది ఆయనలో! అందుకే గజ్జి కుక్కలు, అడవి పందులు అంటూ కతలువడ్డారు. అంతటి అడ్డగోలుతనంలోనూ ఆయన నోట కొన్ని సత్యాలే వెలువడ్డాయి. ప్రస్తుతం విపక్ష పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ నేతలను ఆయన కాపలా కుక్కలుగా అంగీకరించారు. ఎంత కొట్టినా వారు తెలంగాణ ప్రయోజనాలను వీడటంలేదనీ ఒప్పుకొన్నారు.
అవినీతి బురదలో పొర్లుతున్నదెవరో కూడా ఆయన ఫ్లోలో చెప్పేశారు. అవినీతి మకిలి తానొక్కడిదేనా అని ముఖ్యమంత్రి సహా మిగిలిన మంత్రుల పేర్లూపెట్టి, వాళ్ల స్కాములనూ బయటపెట్టి మరీ బురద గుంటలోకి గుంజారు. శేషం కోపేన పూరయేత్ అన్నట్టు జాగీర్ భూములు, క్రషర్ కుంభకోణాల్లో అసలు విషయాలకు వివరణ ఇవ్వకుండా కుక్కలు, నక్కలు, పందుల భాష మాట్లాడి ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా సీట్లోంచి లేచి వెళ్లిపోయారు.