హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ)/భైంసా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని, బీఆర్ఎస్సే ప్రత్యామ్నాయమని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా భైంసాలో మహారాష్ట్రకు చెందిన నాయకుడు డీబీ పటేల్ ఇంట్లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారని తెలిపారు. ఈ నెల 5న (ఆదివారం) మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించామని, అక్కడి ప్రజలకు తెలంగాణ పథకాలను వివరిస్తున్నామని చెప్పా రు. కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశ పరిచిందని విమర్శించారు. సామాన్య ప్రజల నడ్డివిరిచి, కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేవిధంగా ఉన్నదని మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, మురళీగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పీ కృష్ణ, సంజీవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదివారం నాందేడ్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. తెలంగాణేతర రాష్ట్రంలో బీఆర్ఎస్ నిర్వహించనున్న తొలి సభ కావడంతో ఆ పార్టీ నాయకులు దీనిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. సభను విజయవంతం చేసేందుకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే జోగు రామన్న, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్‌సింగ్ తదితరులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. నాందేడ్ జిల్లా కిన్వట్ తాలూకాలోని అనేక గ్రామాల ప్రజలు ఎప్పటినుంచో తమకు తెలంగాణ తరహా అభివృద్ధి, సంక్షేమ పథకాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ తరహా పథకాలు అమలు చేయాలని, లేనిపక్షంలో తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని అనేక గ్రామాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తానే మహారాష్ట్రకు వస్తానని అభయమిచ్చారు. దీంతో సీఎం కేసీఆర్ రాక కోసం నాందేడ్ ప్రజలు ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత నాందేడ్ పర్యటన ఖరారు కాగానే బాల్క సుమన్ అక్కడే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ నాందేడ్‌కు చేరుకోగానే గురుద్వారలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం చేరికల సమావేశం, ఆ తరువాత మీడియా సమావేశం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం నాందేడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.
బీఆర్ఎస్ దేశమంతా వేగంగా విస్తరిస్తున్నదని, ఆంధ్రప్రదేశ్, ఒడిశా నుంచి ఇప్పటికే పలువురు నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మహారాష్ట్రలోనూ భారీఎత్తున చేరికలకు రంగం సిద్ధమైంది. మహారాష్ట్రకు చెందిన సీనియర్ రాజకీయ నేతలు, పలువురు ప్రముఖులు బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తిచూపుతున్నారు. గురువారం మహారాష్ట్రలోని బోకర్ మండలం రాఠీ సర్పంచ్ మల్లేశ్పటేల్తోసహా 100 మంది మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆదివారం మరికొందరు ముఖ్య నేతలు చేరనున్నారు.