Nitin Gadkari | హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం.. అని ప్రగల్భాలు పలికిన బీజేపీ నేతల మత్తు దిగింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఆ పార్టీ అగ్రనేతలే కుండబద్దలు కొట్టి.. రాష్ట్ర పార్టీ నేతల గాలి తీసేశారు. ప్రజల్లో కనీస ఆదరణ లేదని తెలిసినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఝలక్ ఇచ్చారు. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని తేల్చేశారు. అసలే అంతర్గత పోరు, వర్గ విభేదాలతో అతలాకుతలమైన రాష్ట్ర బీజేపీకి.. నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు పుండుమీద కారం చల్లినట్టుగా మారాయి.
తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ‘తెలంగాణలో మేం బలపడతాం. ప్రధాన ప్రతిపక్ష స్థాయికి ఎదుగుతాం. అన్నీ అనుకూలిస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయి’ అని పేర్కొన్నారు. అంటే తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ అధికారంలోకి రాదని గడ్కరీ తేల్చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలకు అంత సీన్ లేదని పరోక్షంగా స్పష్టం చేశారు. నిజానికి నితిన్ గడ్కరీ కూడా వాస్తవ పరిస్థితులకన్నా అధికంగా ఊహించుకున్నారని విశ్లేషకులు అంటున్నారు. పార్టీకి రాష్ట్రంలో ఏమాత్రం ప్రజాదరణ లేదని, ఇటీవలి పరిణామాలు పార్టీని ప్రజల్లో మరింత చులకన చేశాయని చెప్తున్నారు.
బండి సంజయ్ అసమర్థ నాయకత్వం, ఈటల రాజేందర్ రాజేసిన కుంపటి, రఘునందన్‌రావు అలక, ధర్మపురి అర్వింద్ మౌనం, ఇతర నేతల వర్గ పోరు.. ఇలా సవాలక్ష అంతర్గత సమస్యలతో బీజేపీ సతమతమవుతున్నదని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పార్టీలో చేరేందుకు కనీసం గ్రామస్థాయి నేతలు కూడా సిద్ధంగా లేరని, పార్టీలో ఉన్నవారు కూడా బయటికి వెళ్లిపోయేందుకే చూస్తున్నారని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మూడు సీట్లను కాపాడుకోవడమే గగనమని స్పష్టం చేస్తున్నారు. అలాంటిది ప్రధాన ప్రతిపక్ష హోదాకు ఎదుగుతామని నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించడం అత్యాశేనని పేర్కొంటున్నారు. మంత్రి కేటీఆర్ అన్నట్టుగా ఈసారి రాష్ట్రంలో బీజేపీ వందకుపైగా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయే పరిస్థితే ఉన్నదని స్పష్టం చేస్తున్నారు.
గడ్కరీపై రాష్ట్ర నేతల గుస్సా
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలపై రాష్ట్ర నేతలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. తాము అధికారంలోకి వస్తామంటూ బిల్డప్ ఇస్తుంటే గడ్కరీ తుస్సుమనిపించారని మండిపడుతున్నారట. తెలంగాణలో అధికారంలోకి వస్తామని మోదీ, అమిత్ షా వంటివారే అబద్ధాలు చెప్తుంటే.. గడ్కరీ మాత్రం ఎందుకు వాస్తవాలు మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదని వాపోతున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఏ రోజు ఎవరు పార్టీని వీడుతారో తెలియక బిక్కు బిక్కుమంటూ గడుస్తుంటే.. గడ్కరీ వ్యాఖ్యలు నెత్తిపై బండ పడ్డట్టుగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఓవైపు కుమ్ములాటలు, మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజల్లో మరింత చులకన అయ్యామని, ఏం మొఖం పెట్టుకొని మోదీ సభకు జనసమీకరణ చేయగలమని రాష్ట్ర నాయకత్వం ఆందోళన చెందుతున్నదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.