Minister Niranjan Reddy | బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సర్కారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మారెమ్మకుంట నుంచి గాంధీనగర్ వరకు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ఓటర్లను కలుస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ పని చేస్తుందన్నారు. పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ప్రజల అవసరాలు, అభ్యున్నతి లక్ష్యంగా రూపొందించిందన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టబడి సాయం అందిస్తూ పంటలను కొనుగోలు చేస్తుందన్నారు. రాబోయే ఐదేళ్లలో రైతుబంధును రూ.10వేల నుంచి రూ.16వేలకు పెంచుతామన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలందరికీ నెలకు రూ.3వేలు, వచ్చే ఏడాది ఏప్రిల్ – మే నుంచి రేషన్‌కార్డులపై సన్నబియ్యం సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. స్వశక్తి మహిళా సంఘాలకు దశలవారీగా సొంత భవనాల నిర్మాణం చేపడుతామని మంత్రి వివరించారు. ఆసరా పింఛన్‌తో ఆసరాగా నిలుస్తుందన్నారు.
దళితులను గత ప్రభుత్వాలు కేవలం ఓట్ల కోసమే వాడుకున్నారని.. ఎన్నడూ వారి అభివృద్ధి కోసం ఆలోచించిన పాపన పోలేదన్నారు. దళితులు ఆర్థికంగా ఎదగాలని.. అప్పుడే సమాజంలో ఉన్నతంగా ఉంటారన్నారు. వనపర్తిని జిల్లా చేయడమే కాకుండా పరిపాలన భవనాల నిర్మాణం, నూతన ఉన్నత విద్యాసంస్థల రాకతో రాబోయే ఐదేళ్లలో పట్టణం పెద్ద ఎత్తున విస్తరిస్తుందని చెప్పారు. రహదారుల విస్తరణతో పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టామని, జరుగుతున్న అభివృద్ధి మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు మరోసారి ఆశీర్వదించి, అండగా నిలవాలని ఓటర్లను అభ్యర్థించారు.