Chandrababu | హైదరాబాద్, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజలకు అన్నం తినటం అలవాటు చేసింది తెలుగుదేశం పార్టీనే అంటూ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శనమని, అహంకారానికి పరాకాష్ట అని స్పష్టం చేశారు. చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని చంద్రబాబుకు సోమవారం ఒక ప్రకటనలో హితవు పలికారు. ఆంధ్రులకు జొన్నలే ఆహారమని మహాకవి శ్రీనాథుడు ఆరు శతాబ్దాల క్రితమే ఆంధ్రప్రాంత ఆహారం గురించి రాసిన పద్యాన్ని గుర్తు చేశారు. 11వ శతాబ్దం నాటికే కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువుల కింద తెలంగాణలో పంటలు పండించే వారని, వరి, గోధుమలు, కొర్రలు, జొన్నలు, పెసలు, అల్లం, పసుపు, ఉల్లి, చెరుకు పంటలకు తెలంగాణ ఎంతో ప్రసిద్ధి అని గుర్తు చేశారు.
ప్రపంచానికి తొలివాటర్ షెడ్ పరిజ్ఞానాన్ని అందించిన నేల తెలంగాణ అని తెలిపారు. 15వ శతాబ్దం నుంచి హైదరాబాద్ దమ్ బిర్యానికి ప్రసిద్ధి అని పేర్కొన్నారు. 1956లో ఆంధ్రలో విలీనమే తెలంగాణ వినాశనానికి బీజం వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలనలో తెలంగాణలోని చెరువులు, కుంటలను ధ్వంసం చేశారని ఆరోపించారు. ప్రాజెక్టులను పక్కన పెట్టి వైభవంగా ఉన్న తెలంగాణ జీవితాలను సమైక్యపాలనలో చెల్లాచెదురు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో ఉపాధి కరువై బొంబాయి, దుబాయి బాట పట్టేలా చేశారని, ఆఖరికి రూ.2 కిలో బియ్యం కోసం తమ ఓటు హక్కును వినియోగించుకునే దుస్థితికి తెలంగాణ ప్రజలను తీసుకొచ్చారని ఆగ్రహించారు.