
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సమైక్య రాష్ట్రంలో 22 లక్షల బోర్ల ద్వారా వ్యవసాయం జరిగింది. సీఎం కేసీఆర్ మూడున్నరేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారు. సాగుభూమి ఏడేండ్లలో 1.31 కోట్ల ఎకరాల నుంచి 2.15 కోట్ల ఎకరాలకు చేరిందన్నారు. కేసీఆర్ విధానాలతో తెలంగాణ అన్నపూర్ణగా మారిందని స్పష్టం చేశారు. 2020-21 నాటికి ధాన్యం 3 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరిందని తెలిపారు. కేంద్ర మంత్రులు పార్లమెంట్లో తలోమాట చెప్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు ఇంకో మాట చెప్తున్నారు. ధాన్యం సేకరణపై కేంద్రం డబుల్ గేమ్ ఆడుతోందన్నారు. ఈ నేపథ్యంలో యాసంగి సీజన్లో ఇతర పంటలు వేయాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో 22 లక్షల బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం కొనసాగించారు. వానలు రాక, కరెంటు లేక, సాగునీరు అందక రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే సమస్యల పరిష్కారానికి మార్గమని నమ్మి కేసీఆర్ 2001లో మలి దశ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారు. అనేక ఒడిదుడుకుల అనంతరం 14 ఏండ్ల సుధీర్ఘ ఉద్యమం, అనేక మంది అమరుల త్యాగాలు, ప్రజల అండదండలతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి, ప్రజాస్వామ్యబద్దంగా పార్లమెంటును ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.
సాధించుకున్న రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని సీఎం కేసీఆర్ బలోపేతం చేశారు. పెండింగ్ ప్రాజెక్టుల మీద దృష్టి సారించి యుద్ధప్రతిపాదికన పూర్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేండ్లలో పూర్తి చేసి సాగునీరు అందించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ప్రస్తుతం 70 శాతం పైగా పూర్తయ్యాయి. సీతారామ సాగర్ ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్దంగా ఉంది.
ఆకలిచావులు, ఆత్మహత్యలు, వలసలతో సమైక్య రాష్ట్రంలో ఆత్మవిశ్వాసం కోల్పోయి వ్యవసాయానికి దూరమైన రైతాంగానికి సాగునీరు అందించడం ఒక్కటే సమస్య పరిష్కారానికి మార్గం కాదని కేసీఆర్ భావించారు. సాగు నీరు అందించడంతో పాటు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతు భీమా పథకాలను అమలు చేశారు. పంటల రుణమాఫీ చేశారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించారు. వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేశారు. గోదాముల నిర్మాణం చేపట్టారు. దీనిమూలంగా గత ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయరంగ ముఖచిత్రం సంపూర్ణంగా మారిపోయింది. ఏడేళ్ల క్రితం ఆకలిచావులతో అల్లాడిన తెలంగాణ అన్నపూర్ణగా మారింది.
తెలంగాణ వచ్చేనాటికి రెండు సీజన్లు కలిపి సాగుకు యోగ్యమైన భూమి 1 కోటి 31 లక్షల ఎకరాలు. 2020-21 సంవత్సరం నాటికి అన్ని పంటలు కలిపి సాగు విస్తీర్ణమైన భూమి 2 కోట్ల 15 లక్షల ఎకరాలు. 2014-15 లో వరి ధాన్యం దిగుబడి 68.17 లక్షల టన్నులు మాత్రమే ఉండగా, 2020-21 నాటికి అనూహ్యంగా సుమారు 3 కోట్ల టన్నులకు చేరుకున్నది.
అయితే ఉన్నఫలంగా కేంద్రప్రభుత్వం తెలంగాణలోని యాసంగి ధాన్యం కొనుగోలు చేయలేమని స్పష్టం చేసింది. గత ఆరు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నా స్పష్టత ఇవ్వడం లేదు. ముఖ్యంగా తెలంగాణలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగి వరి ధాన్యంలో ఎక్కువగా దొడ్డు రకాలే సాగుచేస్తారు. దొడ్డు రకాలను బియ్యంగా మార్చినప్పుడు యాసంగి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నూక శాతం ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో, నూక శాతం తగ్గించడానికి బాయిల్డ్ రైస్ రూపంలో ఎఫ్ సీ ఐ సేకరిస్తూ వస్తున్నది. అయితే ఈ ఏడాది యాసంగి నుండి తెలంగాణలో బాయిల్డ్ రైస్ సేకరించలేమని హఠాత్తుగా ప్రకటించి తెలంగాణ రైతాంగానికి షాక్ ఇచ్చింది.
దేశంలో రైతులు పండించే పంటలకు మద్దతుధర ప్రకటించడం, వాటిని సేకరించి, నిల్వ చేసి, కరువుకాటకాలు తలెత్తినప్పుడు కార్మికులు, సైనికులకు పంపిణీ చేయడమే కాకుండా సమాజంలో ఉన్న పేద బడుగు బలహీనవర్గాలకు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిరంతరం సరఫరా చేయడం కేంద్రప్రభుత్వ విధి. ఇది 1960 దశకం నుండి కొనసాగుతూ వస్తున్నది. కేంద్రం ప్రకటించిన మద్దతుధరకు వరి ధాన్యం కొనుగోలు చేయడం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్ సీ ఐ చేస్తుంది. 2015లో ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన శాంతా కుమార్ కమిటీ పంటల కొనుగోలు మాత్రమే కాకుండా ఎఫ్ సీ ఐ సంస్థ పంటల ఎగుమతుల మీద కూడా దృష్టిసారించాలని, నిల్వల సామర్ధ్యం పెంచుకోవాలని, పండిన పంటలన్నీ మద్దతుధరకు కొనుగోలు చేయాలని నివేదికలో సూచించింది. కానీ కేంద్రం ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
తెలంగాణలో యాసంగి వరి ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరి దూడను చీకమని, బర్రెను తన్నమని చెప్పినట్లుంది. తెలంగాణలో ఈ యాసంగి నుండి బాయిల్డ్ రైస్ సేకరణ ఉండబోదని కేంద్రం స్పష్టంగా ప్రకటించింది.
తెలంగాణ నేలలు అన్నిరకాల పంటల సాగుకు అనుకూలం. వరి సాగుకు మాత్రమే అనుకూలంగా ఉండే కొన్ని భూములను వదిలేస్తే మిగిలిన భూములలో వైవిధ్యమయిన పంటలను పండించవచ్చు. అందుకు తగిన వాతావరణ పరిస్థితులు ప్రపంచంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే సొంతం. అందులో తెలంగాణ ప్రాంతం ఒకటి. ప్రస్తుతం ఉన్న వసతులను సద్వినియోగం చేసుకుని మార్కెట్లో డిమాండ్ ఉన్న వివిధ రకాల ఇతర పంటలను సాగు చేయాల్సిన అవసరం ఉంది. దీనికి గాను తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే తొలిసారి మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ను ఏర్పాటు చేసి ప్రతి సీజన్ కు ముందే ప్రభుత్వ బాధ్యతగా ఏ రకమైన పంటలు సాగు చేయాలి ? రైతులకు ఎలాంటి లాభం ఉంటుందో దానికి అనుగుణంగా సూచనలు చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వ మోసపూరిత విధానాలను పసిగట్టిన తెలంగాణ ప్రభుత్వం గత కొంతకాలంగా తెలంగాణ రైతాంగాన్ని అప్రమత్తం చేస్తూ ఆరుతడి పంటల వైపు మళ్లించే ప్రయత్నాలను చేస్తూ వస్తున్నది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాలను అర్ధం చేసుకుని తెలంగాణ రైతాంగం ఈ యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలు మాత్రమే సాగు చేయాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం ఇచ్చే, మార్కెట్లో డిమాండ్ ఉండే పప్పు గింజలు, నూనెగింజలు వంటి పంటలను సాగు చేసి అధిక ఆదాయం పొందాలని ఆకాంక్షిస్తున్నది.