హైదరాబాద్ : రైతుల మరణాలను ఆత్మహత్యలంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని పత్రికలు పనిగట్టుకుని విషప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయన్నారు. ఈ మేరకు శుక్రవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణలో రైతుల మరణాలు తగ్గాయని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇందుకు సీఎం కేసీఆర్ ముందుచూపే కారణమన్నారు. తెలంగాణలో 2017లో రైతు మరణాలుగా నమోదైన సంఖ్య 846 కాగా, 2021లో 352 మంది మరణించినట్లు కేంద్రమే ప్రకటించిందన్నారు. దేశంలో రైతుల మరణాలపై రాజ్యసభలో ఎంపీ నారాయణదాస్ గుప్తా అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారన్నారు. రైతుల మరణాలపై పార్లమెంటులో కేంద్రమంత్రి చెప్పిన సమాధానం చూసైనా రాష్ట్రంలో విపక్షాలు రైతుల మరణాలపై రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. రైతులు ఏ కారణంతో మరణించిన రైతుబీమా ద్వారా రూ. 5 లక్షలు పరిహారం అందించి ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని తెలిపారు.