హైదరాబాద్, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ): యాసంగిలో పంటల మార్పిడిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పప్పులు, నూనెగింజల సాగు వైపు రైతులను మళ్లించాలని సూచించారు. రైతు వేదికల ద్వారా పంటల మార్పిడిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. మంగళవారం ఆయన వ్యవసాయశాఖపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎక్కువగా కూరగాయలు పండించేలా రైతులను ప్రోత్సహించాలని నిరంజన్‌రెడ్డి సూచించారు. కోహెడలో అంతర్జాతీయ వసతులతో మార్కెట్ ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధం కాగానే సీఎం కేసీఆర్ అనుమతులు తీసుకుంటామని తెలిపారు. కొల్లాపూర్‌లో మామిడి మార్కెట్, వరంగల్, ఖమ్మంలో మిరప ట్రేడింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్లను, చెక్‌పోస్టులను మరింత బలోపేతం చేయాలని, మార్కెట్ ఫీజును పక్కాగా వసూలు చేయాలని ఆదేశించారు. యాసంగికి అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని, లోటు లేకుండా ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్న శ్రీగంధం సాగును ప్రోత్సహించాలని చెప్పారు. శ్రీగంధం విక్రయించేందుకు అటవీశాఖ నిబంధనలను సరళతరం చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలలకు నిత్యావసరాలను సరఫరా చేసే దిశగా హాకా ఆలోచించాలని, దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నూతన గోదాముల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్రెడ్డి పాల్గొన్నారు.