వనపర్తి : రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ను ఆదరించి బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(Minister Niranjan Reddy) జోస్యం చెప్పారు. మంగళవారం వనపర్తి జిల్లా(Vanaparthy) కేంద్రంలోని లక్ష్మీ ప్రసన్న గార్డెన్స్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సమావేశానికి మంత్రి హాజరయ్యారు.
తెలంగాణలో ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే(BRS Government) ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వచ్చిన అమిత్ షా(Amit Sha) ఆ రిజర్వేషన్లు తీసేస్తామంటూ ప్రగల్భాలు పలికారని విమర్శించారు. ఔరంగాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్(BRS)సభలో వచ్చే ఐదేండ్లలో ఇంటింటికీ తాగునీరు సరఫరా, తదితర కార్యక్రమాలను వివరించారని తెలిపారు. ఒకరు వినాశాన్ని కోరుకుంటుండగా మరొక అభివృద్ధిని కాంక్షిస్తూ మాట్లాడారని గుర్తు చేశారు.
దేశం తిరోగమనం వైపు వెళ్లాలా.. ఆధునిక ప్రపంచంతో పోటీపడి పురోగమనం వైపు వెళ్లాలా అన్నది మన ముందున్న ప్రశ్న అన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలు (Parliament)ఈ దేశ భవిష్యత్‌కు పరీక్ష అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి రిక్త హస్తమే చూపించిందని దుయ్యబట్టారు. త్వరలో మంత్రి కేటీఆర్(Minister KTR) చేతుల మీదుగా బైపాస్ రహదారికి శంకుస్థాపన, సమీకృత మార్కెట్, టౌన్ హాల్, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం భారీ బహిరంగ సభను నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. సమావేశంలో రాష్ట్ర నాయకురాలు సింగిరెడ్డి వాసంతి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.