హైదరాబాద్ : ప్రధాని మోదీకి తెలంగాణ అభివృద్ధిపై ఈర్ష్య, ద్వేషం, అసూయ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. రాజ్యసభలో తెలంగాణ పట్ల ప్రధాని మోదీ వ్యాఖ్యలపై నిరసనగా.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వనపర్తి జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులు నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ దిష్టిబొమ్మ దహనం చేసి, అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరుగనపడేసి.. దేశాన్ని మోనార్క్‌లా ఏలాలని మోదీ అనుకుంటున్నాడని విమర్శించారు. దేశంలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాక అనివార్య పరిస్థితుల్లో అందరికన్నా ఆఖరుకు సమ్మతించి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజా పోరాటానికి తలొగ్గి విధిలేక 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ఇవ్వదనుకొని.. బీజేపీ తర్వాత ఎలాగైనా దాటవేయొచ్చని.. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో తెలంగాణ ఇస్తామన్నారు.
కానీ తెలంగాణ ప్రజల అదృష్టం, కేసీఆర్ నాయకత్వంలో పెరిగిన ఒత్తిడి, ఆమరణ నిరాహార దీక్ష, వందలాది మంది తెలంగాణ బిడ్డల బలిదానాలు.. అన్నీ వెరసి తెలంగాణ సమాజం గిరిగీసి నిలబడడంతో ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే రాజకీయ భవిష్యత్ ఉండదనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదించారన్నారు. రాష్ట్ర విభజనకు ముందు అన్ని రకాలుగా చర్చలు జరిగాయన్నారు. పార్లమెంట్లో, అఖిలపక్షాల భేటీలో, జేఏసీలో, శ్రీకృష్ణ కమిటీ పర్యటనలో చర్చలు జరిగాయని, ఇవన్నీ అయ్యాక పార్లమెంట్లో ప్రత్యేక తెలంగాణ బిల్లు పాసైందని గుర్తు చేశారు.
ఇవన్నీ జరిగాక వచ్చిన బిల్లును మోదీ అవమానించి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారన్నారు. ఇది దేశానికి మంచిది కాదన్నారు. తెలంగాణ ఏర్పాటై ఎనిమిళ్లయి అద్భుతంగా అభివృద్ధిలో పురోగమిస్తున్నామని, దేశంలో అనేక రంగాల్లో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ నంబర్ వన్ స్థానానికి ఎగబాకిందన్నారు. మోదీ రాచరికపు, ఆలోచనా విధానానికి గండి కొట్టే సాహసం చేస్తున్నదని ఒక్క కేసీఆర్ అని, అందుకే తెలంగాణ మీద కసిబూని మాట్లాడుతూ పిచ్చికూతలు కూస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవారని, దాన్ని మరిచిన పాలకులు ప్రజల పాదాల కింద ధూళిలో కలిసిపోతారన్నారు.