బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. మహబూబ్ నగర్ వేదికగా ఆయన ఓ వీధి రౌడీలా మాట్లాడారని తీవ్రంగా మండిపడ్డారు. తమ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందంటూ పదే పదే విమర్శలు చేశారని, బీజేపీకి దమ్ముంటే తమ అవినీతిపై దర్యాప్తు చేయాలని మంత్రి సవాల్ విసిరారు. తెలంగాణ మిషన్ భగీరధ, కాళేశ్వరం పథకాలను కేంద్రం పార్లమెంటులో ప్రశంసించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
వ్యవసాయం మంత్రి నిరంజన్ రెడ్డి శుక్రవారం నిజామాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నడ్డాకు సిగ్గు, చీము, నెత్తురు ఉంటే పాలమూరు ఎన్నికల సభలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపడతాం అన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లుగా కృష్ణాజలాలలో తెలంగాణ వాటా తేల్చకుండా నాన్చుతున్న కేంద్రానికి సిగ్గు, శరం ఉండాలని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును అడుగడుగునా అడ్డుకున్న దుర్మార్గుడు మోడీ అని, తల్లిని చంపి, పిల్లను బతికించారని అక్కసు, ఆక్రోషం కక్కిన మూర్ఖుడు మోడీ అని గుర్తు చేశారు.
నోరు తెరిస్తే ప్రధాని నుండి అందరు బీజేపీ నేతలు అబద్దాలు మాట్లాడుతున్నారని, నల్లధనం తెస్తాం .. ప్రజల అకౌంట్లలో వేస్తామని మోడీ ప్రకటించాడని ఏమైందని మంత్రి ప్రశ్నించారు. 2014, 2019 మేనిఫెస్టోలలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు, కానీ.. రైతుల పెట్టుబడి రెట్టింపు చేశారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాజకీయ ప్రయోగ శాల కాదు…
తెలంగాణ రాజకీయ ప్రయోగశాల కాదని, నిన్న నడ్డ, నేడు రాహుల్ లు తెలంగాణ లో అడ్డా వేసినా ఏం కాదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనను దశాబ్దాలపాటు భరించి ప్రజలు తిప్పికొట్టారని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణలో భవిష్యత్ లేదని స్పష్టం చేశారు. కర్ణాటకలో ప్రజలు ఆదరించకున్నా తుచ్చమైన అనైతిక చర్యలకు పాల్పడి ప్రధాని నేతృత్వంలో అధికారం దక్కించుకున్నారని, బీజేపీది తెలంగాణలో తోడు పెండ్లికొడుకు పాత్ర అంటూ మంత్రి నిరంజన్ ఎద్దేవా చేశారు.