హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేకి అని అమిత్ షా వ్యాఖ్యానించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. అనతి కాలంలోనే వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రైతుబీమా, రైతుబంధు, సాగునీటితో పాటు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని పేర్కొన్నారు. దీంతో రైతులందరూ సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ ఎనిమిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతుల కోసం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ మాదిరిగా వ్యవసాయ పథకాలు అమలు చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టని హామీలను కూడా నెరవేర్చారని, కానీ బీజేపీ మాత్రం మేనిఫెస్టోలో పెట్టిన హామీలను కూడా తుంగలో తొక్కిందని విమర్శించారు. వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం, 60 ఏళ్లు నిండిన రైతులకు పించన్లు, రైతుల ఆదాయం రెట్టింపు, మద్దతు ధరపై స్వామినాథన్ కమిటీ సిఫార్సులు ఇలా బీజేపీ విస్మరించిన హామీలు ఎన్నో ఉన్నాయన్నారు. మోటార్లకు మీటర్లపై ప్రశ్నించిన రైతు ప్రతినిధుల మీద ఎందుకు రుసరుసలాడారని నిలదీశారు.
అమిత్ షా ఆగ్రహిస్తే తలవంచడానికి తెలంగాణ సామంత రాజ్యం కాదని, కేసీఆర్ నాయకత్వంలో సుధీర్ఘ పోరాటంతో ఢిల్లీ మెడలు వంచి పార్లమెంటును ఒప్పించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రమని గుర్తు చేశారు. పోరాటం తెలంగాణకు కొత్త కాదని, తెలంగాణతో గోకున్నోడు ఎవడూ బాగుపడలేదని స్పష్టం చేశారు. ఎనిమిదేళ్లలో తెలంగాణను ఆకలికేకల నుండి అన్నపూర్ణగా ఎదిగిన రాష్ట్రంపై విషం కక్కుతున్న బీజేపీ నేతలకు తెలంగాణ ప్రజలు తగిన బుద్దిచెబుతారన్నారు.