హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు తలెత్తుకోలేని దుస్థితి నుంచి నేడు సగర్వంగా తలెత్తుకొని, తాము తెలంగాణ రైతులమని చెప్పుకొనే స్థాయికి మన రైతులు ఎదిగారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్ చేసిన కృషే కారణమని చెప్పారు. శనివారం రవీంద్రభారతిలో నిర్వహించిన ఓ యూట్యూబ్ చాన ల్ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో వ్యవసాయానికి, ఆహారానికి ప్రత్యామ్నాయం లేదన్నారు. వ్యవసాయాన్ని, రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక వ్యవసాయ పథకాలతో ఆకలి ఇబ్బందుల నుంచి నిల్వలు దాచుకునే స్థాయికి ఎదిగామని అన్నారు. వ్యవసాయంలో మరిం త సాంకేతికత, యాంత్రీకరణ పెరగాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని 2009 నుంచి కేంద్రాన్ని కోరుతున్నామని గుర్తుచేశారు. ఇందుకు హామీ ఇచ్చి మ్యానిఫెస్టోలో కూడా పెట్టిన బీజేపీ అధికారంలోకి వచ్చాక విస్మరించిందని మండిపడ్డారు.
రైతులకు అండగా సీఎం కేసీఆర్: గుత్తా
వ్యవసాయం దండగ అన్న స్థితి నుంచి కేసీఆర్ నాయకత్వంలో పండగ చేసుకున్నామని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. రైతుబంధు, రైతుబీమా, సాగునీళ్లు, ఉచిత కరెంటు, ధాన్యం కొనుగోళ్లతో సీఎం రైతులకు అండగా నిలిచారని స్పష్టంచేశారు. రైతు విజయాలు, ఆవిష్కరణలను యూట్యూ బ్ ద్వారా రైతులకు అందించేందుకు చానల్ నిర్వాహకుడు రాజేందర్‌రెడ్డి చేస్తున్న కృషిని ప్రశంసించారు. రైతులకు అవగాహన కల్పిస్తున్న రాజేందర్‌రెడ్డిని సమాచారశాఖ మాజీ కమిషనర్, సీనియర్ జర్నలిస్ట్ కట్టా శేఖర్‌రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ రాజావరప్రసాద్రావు తదితరులు పాల్గొన్నారు.