నల్లగొండ : మూస ధోరణిలో ఒకే రకమైన పంటలు పండించకుండా, వాణిజ్య పంటలను పండించేలా రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. అన్నదాతలను ప్రతి ఒక్కరూ గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నల్లగొండ, యాదాద్రి జిల్లాల వ్యవసాయ అధికారులకు, రైతుబంధు సమితి సభ్యులకు వానాకాలం సాగు సన్నద్ధతపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
ఇవాళ రాష్ట్రంలో ఉన్న బీడు భూములన్ని పలు రకాల పంటలతో కళకళలాడుతున్నాయని తెలిపారు. 2020-21 సంవత్సరంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తెలంగాణ పండించిందని గుర్తు చేశారు. దేశానికే అన్నం పెట్టేస్థాయికి తెలంగాణ చేరుకోవడం మనందరికీ గర్వకారణం అని మంత్రి పేర్కొన్నారు.
ప్రజల జీవన విధానంలో మార్పులు వచ్చాయి. ప్రజల ఆహారపు అలవాట్లు కూడా మారాయి. వాటికి అనుగుణంగా తృణ ధాన్యాలు, ఉద్యానవన పంటలను కూడా పండించాలని మంత్రి సూచించారు. ఇవాళ నూనె గింజల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. 2 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తామన్నారు. భవిష్యత్‌లో 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును విస్తరిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ పత్తి అంటే హాట్ కేక్ లాగా అమ్ముడు పోతుందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆముదం పంటకు కూడా అద్భుతమైన లాభాలు వస్తాయి. పంట మార్పిడి వల్లనే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. వ్యవసాయ అధికారులు పర్యటనలు చేసి, కొత్త కొత్త వ్యవసాయ విధానాలు తెలుసుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు.