హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బిడ్డ పెండ్లికి పైసలు ఇచ్చింది తానేనని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మాట అబద్ధమైతే రేవంత్‌రెడ్డి యాదగిరి నర్సన్న మీద ప్రమాణం చేసి చెప్పాలని సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డి దొంగరెడ్డి అని, ఆయన చేపట్టింది రచ్చబండ కాదు..లుచ్చాబండ అని వ్యాఖ్యానించారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రచ్చబండ పేరిట రేవంత్ దరిద్రపు రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ దివాళా తీయబోయే పార్టీలని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి.. దొంగరెడ్డి, బ్రోకర్రెడ్డి, బట్టేబాజ్రెడ్డి అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే వాళ్లు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో వరంగల్ డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్ నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు
రేవంత్‌రెడ్డి జీవితమంతా బ్లాక్మెయిలేనని మంత్రి మల్లారెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీలో ఉన్నప్పుడు తనను బ్లాక్మెయిల్ చేశాడని ఆరోపించారు. బ్లాక్మెయిల్ దందాలతో పార్టీలు మారు తూ కోట్లు సంపాదించాడని, ఆ పైసలతోనే పీసీసీ పదవి కొనుక్కున్నాడని విమర్శించారు. రేవంత్ త్వరలో బీజేపీలో చేరతాడని జోస్యం చెప్పారు. రేవంత్ కాలుమోపిన ఏ పార్టీ అయినా మటాష్ అవుతుందని, కాంగ్రెస్‌కి అదే గతి పడుతుందని ఎద్దేవా చేశారు. తన కాలేజీలను మూయించేందుకు రేవంత్ శతవిధాలా ప్రయత్నించాడని ఆరోపించారు. తాను రేవంత్‌రెడ్డి లాగా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించలేదని పేర్కొన్నారు. తాను ప్రభుత్వ భూములను ఎక్కడా కొనలేదని తెలిపారు.
పెట్టుబడుల కోసం కేటీఆర్.. జల్సాల కోసం రాహుల్‌గాంధీ
కేటీఆర్ విదేశాలు తిరిగి రాష్ర్టానికి పెట్టుబడులు తెస్తుంటే, రాహుల్‌గాంధీ నైట్ క్లబ్బుల కోసం, జల్సాల కోసం విదేశీ టూర్లకు వెళ్తున్నాడని మల్లారెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో తెలంగాణ ప్రతిష్ఠను మంత్రి కేటీఆర్ ఇనుమడింపజేస్తున్నారని అన్నారు. ఫాదర్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ అని చెప్పారు. సీఎం కేసీఆర్ అన్ని ప్రాంతీయ పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చి, దేశాన్ని పాలించడం ఖాయమని మంత్రి చెప్పారు. భవిష్యత్తులో అన్ని రాష్ర్టాల్లోనూ రైతుబంధును ప్రవేశపెట్టే దమ్మున్న నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. బీజేపీ దేశాన్ని దివాళా తీయించిందని, ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా కోసమే కేసీఆర్ దేశ పర్యటన చేస్తున్నారని స్పష్టంచేశారు. రాష్ట్రంలో కేసీఆర్ మాత్రమే రెడ్లకు సముచిత స్థానం కల్పించారని చెప్పారు.
చీటర్స్ కమిటీగా మార్చారు: కేపీ వివేకానంద
పీసీసీని రేవంత్‌రెడ్డి ప్రదేశ్ చీటర్స్ కమిటీగా మార్చారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద ధ్వజమెత్తారు. రైతు సంక్షేమానికి కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అయితే, రేవంత్ కేడీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడని అన్నారు. వెంటిలేటర్‌పై ఉన్న కాంగ్రెస్‌కు యాక్టర్, చీటర్ లాంటి రేవంత్ దొరికాడని ఎద్దేవా చేశారు. రేవంత్ వ్యాఖ్యలను రెడ్డి సామాజికవర్గమే అసహ్యించుకొంటున్నదన్నారు.
రేవంత్ క్షమాపణ చెప్పాలి: శంభీపూర్ రాజు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను అవమానపరిచిన రేవంత్.. వెంటనే క్షమాపణ చెప్పాలని ఎమ్మె ల్సీ శంభీపూర్ రాజు డిమాండ్ చేశారు. ఉద్యమద్రోహిగా ముద్రపడ్డ రేవంత్.. ఇప్పుడు అన్ని సామాజిక వర్గాల ద్రోహిగా మారాడని అన్నారు. కులంపేరుతో ఒకడు.. మతం పేరుతో ఒకడు చిచ్చుపెట్టాలని చూస్తే ఉరికిచ్చి కొడతారని హెచ్చరించారు.