హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ చాయ్ లెక్కనే దేశాన్నీ అమ్మేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. దేశంలోని పబ్లిక్ ప్రాపర్టీ మొత్తాన్నీ దశలవారీగా దోస్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. శుక్రవారం శాసనసభలో కార్మిక శాఖ పద్దును మంత్రి మల్లారెడ్డి వివరించారు. కార్మికులపై కేంద్ర సర్కారు అక్కసు వెళ్లగక్కుతున్నదని ఫైర్ అయ్యారు. ఈఎస్ఐ కార్పొరేషన్ నుంచి తెలంగాణకు ప్రతి ఏటా రూ.463 కోట్లు రావాలని, కానీ వివిధ సాకులు చూపుతూ రూ.226 కోట్లు మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్నారు. కార్మికుల బీమా డబ్బులను కార్మికులకే తిరిగి ఇచ్చేందుకు మోదీకి మనసొప్పడం లేదని విమర్శించారు. కేంద్రం సహకరించకున్నా, తెలంగాణలో కార్మిక సంక్షేమం, ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు. ఉపాధి కల్పనలో దేశంలోనే తెలంగాణ మూడోస్థానంలో ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ విదేశాల్లో పర్యటిస్తూ రాష్ర్టానికి పెద్ద ఎత్తున కంపెనీలు తీసుకొస్తున్నారని ప్రశంసించారు. కాంగ్రెస్ పాలనలో అన్నీ స్కాములేనని, కానీ బీఆర్ఎస్లో అన్నీ స్కీములే ఉన్నాయని పేర్కొన్నారు. అభివృద్ధి కోసం పనిచేస్తున్న తనపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఐటీ దాడులు చేశారని, చివరికి ఏం సాధించారని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామిపై అనేక ఆరోపణలు ఉన్నాయని, మోదీకి దమ్ముంటే వాళ్లపై ఐటీ దాడులు చేయాలని మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు.
తెలంగాణలో పెట్టుబడులకు మార్గాన్ని సులభతరం చేశామని, ఒక్క దరఖాస్తుతో అనుతులన్నీ ఇచ్చేస్తున్నామని మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు ఐదేండ్లపాటు రూ.5 లక్షల బీమాను అందిస్తున్నామని పేర్కొన్నారు. 13 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు చేయూతనిస్తున్నామని తెలిపారు. నిరుడు 52 వేలమందికి రూ.370 కోట్లతో ఆర్థికసాయం అందజేసినట్టు చెప్పారు. భవన నిర్మాణ కార్మికులు ప్రమాదంలో మరణిస్తే కుటుంబానికి రూ.6 లక్షలు, అంగవైకల్యం కలిగితే రూ.5 లక్షలు, సహజ మరణానికి రూ.లక్ష, వివాహ, ప్రసూతి సహాయానికి రూ.30 వేలు ఇస్తున్నామని వెల్లడించారు. అప్రెంటిస్‌షిప్ ద్వారా 1,746 ఉద్యోగాలు, వివిధ రూపాల్లో మరో 26,519 ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. విదేశాల్లో 2,800 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని వెల్లడించారు. రాష్ట్ర కార్మిక శాఖకు 18 వందల కోట్ల ఎఫ్డీలు ఉన్నాయని తెలిపారు. కార్మిక, ఉపాధి కల్పనకు బడ్జెట్లో రూ.511 కోట్లు ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు. ప్రగతిభవన్‌ను పేలుస్తామని, సచివాలయాన్ని కూలుస్తామని రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ అంటున్నారని, ఇది వాళ్ల నీచబుద్ధికి నిదర్శనమని విమర్శించారు. ‘ఈ సారి కేటీఆర్ సీఎం.. కేసీఆర్ పీఎం అవుడు పక్కా..’ అని మల్లారెడ్డి ప్రసంగాన్ని ముగించారు. అప్పటి వరకు సీరియస్‌గా సాగిన సభలో మల్లారెడ్డి కాసేపు నవ్వులు పూయించారు.