కోస్గి, అక్టోబర్ 20 : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు పెద్ద బోగస్ అని సమాచార, భూగర్భ గనుల శాఖల మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి(Minister Mahender Reddy )పేర్కొన్నారు. సీఎం పదవి కోసం ఎంతో మంది పోటీ పడుతున్నారని, అలాంటి కుమ్ములాటల పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కోస్గి పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
అనునిత్యం ప్రజల్లో తిరిగే పట్నం నరేందర్‌రెడ్డి లాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా కావాలా..? ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి హైదరాబాద్‌కే పరిమితమయ్యే కాంగ్రెస్ నాయకులు కావాలా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. పట్నం నరేందర్‌రెడ్డిని ఆదరించి కారుగుర్తుకు ఓటేయాలని కోరారు. సమావేశంలో జెడ్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి, ఎంపీపీ మధుకర్‌రావు, వైస్ ఎంపీపీ సాయిలు, మున్సిపల్ చైర్పర్సన్ శిరీష కార్యకర్తలు పాల్గొన్నారు.