Suryapet | ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ సేవలను విస్తరించాలనే లక్ష్యంగా ముందుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం సూర్యాపేటలో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పాత కలెక్టరేట్లో 9 కంపెనీలతో ఐటీ టవర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఈ ఐటీ టవర్‌ను అక్టోబర్ 2వ తేదీన మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు టాస్క్ ( తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ) అధికారులతో కలిసి బ్రోచర్‌ను విడుదల చేశారు.
సూర్యాపేటలో ఏర్పాటు చేయబోయే ఐటీ టవర్‌లో తొలి దశలో భాగంగా 180 మందికి ఉపాధి కల్పించనున్నట్లు మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలోనే సూర్యాపేటలో ఈ నెల 26న ఐటీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఐటీ హబ్‌లో ఏర్పాటు కానున్న 9 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 26వ తేదీన ఐటీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. సూర్యాపేటలోని సదాశివరెడ్డి ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ జాబ్ మేళా కొనసాగనుందని చెప్పారు. బీటెక్ చదివిన నిరుద్యోగ యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రెండు రోజుల వ్యవధిలోనే ఐటీ కార్యకలాపాలు నిర్వహించేందుకు 9 కంపెనీలు ముందుకొచ్చాయని.. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు ముందుకు రానున్నట్లు తెలిపారు. రాబోయే మూడేండ్ల కాలంలో ఐటీలో హైదరాబాద్ తర్వాత సూర్యాపేటను తీర్చిదిద్దుతామని అన్నారు.
కాగా, వచ్చే నెల 2న మంత్రి కేటీఆర్ సూర్యాపేటతో పాటు నల్లగొండ జిల్లాలోనూ పర్యటించనున్నారు. నల్లగొండలో ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న ఐటీ హబ్‌ను కూడా ప్రారంభించనున్నారు. వాటితో పాటు నల్లగొండలో రూ.234 కోట్లతో నిర్మించనున్న కళాభారతి, పానగల్ ఉదయ సముద్రం చెరువు, వల్లభరావు చెరువులను ట్యాంకుబండ్లుగా తీర్చిదిద్దే పనులకు శంకుస్థాపన చేయనున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇప్పటికే పూర్తయిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.