హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫేషియల్ అటెండెన్స్‌ను అమలు చేయనున్నారు. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్‌లలో యాప్‌ను ఇన్స్టాల్ చేసి, కెమెరా ఆధారంగా స్కాన్ చేసి విద్యార్థుల హాజరును నమోదు చేయడం ఈ విధానం ప్రత్యేకత. ఇదే తరహా హాజరు విధానాన్ని టీచర్లకు వర్తింపజేస్తారు.
రాష్ట్రంలో 26 వేలకు పైగా ప్రభుత్వ బడులున్నాయి. ఈ బడుల్లో 20వేల ట్యాబ్‌లను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) ద్వారా టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి తెప్పించారు. త్వరలోనే ఈ ట్యాబ్‌లను మంత్రి కేటీఆర్ టీచర్లకు అందజేస్తారు. వెయ్యిలోపు విద్యార్థులున్న బడికి ఒకటి, వెయ్యి మంది కంటే ఎక్కువ మంది విద్యార్ధులున్న బడులకు రెండు ట్యాబ్‌లను అందజేయనున్నట్టు విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ ట్యాబ్‌లలో హాజరు నమోదుతో పాటు మధ్యాహ్న భోజన విద్యార్థుల సమాచారం, వారి ప్రగతిని అప్లోడ్ చేస్తామని పేర్కొన్నారు.