Telangana Decade Celebrations | హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రగతిపై వేడుకలు అట్టహాసంగా నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించే రాష్ట్రస్థాయి ఉత్సవాల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. వేడుకల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధులు జెండా ఆవిష్కరించి, కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
అనంతరం పట్టణాల అభివృద్ధికోసం కేటాయించిన నిధులు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల వివరాలను వెల్లడిస్తారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు, అనంతరం జరిగిన అభివృద్ధి వివరాలను ఫ్లెక్సీల ద్వారా ప్రదర్శిస్తారు. వివరాలతో కూడిన బ్రోచర్లను పంపిణీ చేస్తారు. రవీంద్రభారతిలో నిర్వహించే సభలో మహానగర అభివృద్ధిపై చర్చిస్తారు. ఉత్తమ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కౌన్సిలర్లు, చైర్మన్లు, ఉద్యోగులను ఘనంగా సన్మానిస్తారు.