Minister KTR | నిజామాబాద్ పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బయల్దేరి వెళ్లారు. నిజామాబాద్‌లో రూ.50 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్‌ను ఆయన ప్రారంభించనున్నారు. దీనితో పాటు న్యాక్, మున్సిపల్ కార్పొరేషన్ భవనాలను, అధునాతన వైకుంఠధామాన్ని, రఘునాథ చెరువు ట్యాంక్‌బండ్‌ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి వెళ్లారు. కేటీఆర్ వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిజామాబాద్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు.
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు. కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. సభా ఏర్పాట్లను మంగళవారం ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్ తదితరులు పరిశీలించారు. నిజామాబాద్‌లోని ఈ ఐటీ టవర్‌ను మొత్తం 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆకట్టుకునే రీతిలో నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో కలుపుకొని మూడు అంతస్థులతో ఈ నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఎకరం భూమిలో ఐటీ టవర్‌ను డిజైన్‌చేశారు. మిగిలిన 2.5 ఎకరాల భూమిని భవిష్యత్తులో ఐటీ టవర్‌ను విస్తరణకు ఉపయోగించనున్నారు.
నిజామాబాద్‌లో కలెక్టరేట్, ఐటీ టవర్‌కు ఆనుకుని రూ.6.15 కోట్లతో నిర్మించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ఏసీ) సెంటర్‌కు జిల్లా నైపుణ్య అభివృద్ధి కేంద్రంగా నామకరణం చేశారు. ఇందులో 5 స్మార్ట్ క్లాస్ గదులు, 3 ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్, 120 మంది అభ్యర్థులకు వసతి, భోజన సౌకర్యానికి వీలుగా వసతి గృహం, ఒక కౌన్సెలింగ్ గది, ఒక ప్లేస్మెంట్ రూం, 8 కార్యాలయ గదులను నిర్మించారు. నిజామాబాద్ నగరంలో నలుదిక్కులా నాలుగు ఆధునిక వైకుంఠధామాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
నలుదిక్కులా నాలుగింటికి శ్రీకారం చుట్టగా మూడు ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. రూ.20 కోట్లతో వీటి నిర్మాణాన్ని చేపడుతున్నారు. దుబ్బలో రూ.8.4 కోట్లు, వర్ని రోడ్డులో రూ.2.46 కోట్లు, అర్సపల్లిలో రూ.4.8 కోట్లు వెచ్చించారు. ప్రగతినగర్‌లో కొత్తది నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.4.5 కోట్లు కేటాయించారు. నగరంలోని చారిత్రక రఘునాథ చెరువును రూ.14 కోట్లతో అభివృద్ధి చేశారు. ఈ చెరువు కట్టను పటిష్ట పర్చడంతో పాటు పచ్చదనంతో నింపారు. వైట్‌హౌస్‌ను తలపించేలా రూ.7 కోట్లతో మున్సిపల్ కార్పొరేషన్ భవనాన్ని నిర్మించారు.