హైదరాబాద్ : గచ్చిబౌలి టిమ్స్‌ను రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా హైసియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 150 ఐసీయూ బెడ్స్‌ను ప్రారంభించారు. అనంతరం కరోనా వార్డులను కేటీఆర్ కలియతిరిగారు. కరోనా బాధితులను పరామర్శించి.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 1200 బెడ్స్‌తో కరోనా రోగులకు సేవలు అందుతున్నాయి. కొత్తగా ప్రారంభించిన 150 పడకలను రూ. 15 కోట్లతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హైసియా సభ్యులకు కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. ప్రస్తుత లాక్డౌన్ ముగిసేలోగా రెండో దశ తీవ్రత తగ్గే అవకాశం ఉందన్నారు. మళ్లీ సాధారణ జీవనం గడిపే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు అంచనా వేస్తున్నారు అని తెలిపారు. కరోనా విజృంభించినప్పటి నుంచి విరామం లేకుండా వైద్య సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇంటింటి సర్వే ద్వారా నివారణ చర్యలు చేపట్టామన్నారు. సూపర్ స్ర్పెడర్లకు ప్రాధాన్యతా క్రమంలో టీకాలు ఇస్తున్నామని తెలిపారు.
ప్రపంచానికే వ్యాక్సిన్ రాజధానిగా ఉన్నామని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం అనాలోచిత నిర్ణయాల వల్ల మందకొడిగా వ్యాక్సినేషన్ జరుగుతుందన్నారు. విదేశాల్లో 50 కోట్ల ఆస్ర్టాజెనికా డోసులు నిరూపయోగంగా ఉన్నాయన్నారు. టీకాలు కొనకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. పావలా శాతం టీకాలు లేకుండా ఎగుమతి చేపట్టారు. ఇకనైనా కేంద్రం మేల్కొని విదేశాల్లోని టీకాలు తెప్పించాలని సూచించారు. టిమ్స్‌లో నెలకొన్న సమస్యలతో పాటు వైద్యుల సమస్యలను కూడా పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో విపత్తు నుంచి బయటపడుతామని కేటీఆర్ పేర్కొన్నారు.
Minister @KTRTRS formally inaugurated 150 bed ICU at TIMS, Gachibowli. This project is sponsored by @HYSEA1991 and member companies including Microsoft, Qualcomm, Franklin Templeton, Cognizant and WellsFargo. pic.twitter.com/oDRCJt4zf9
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 4, 2021