రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలోని అమ్మమ్మ-తాతయ్య జోగినిపల్లి కేశవరావు- లక్ష్మీబాయి స్మారకార్థం రూ.2కోట్లతో ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మోడల్ అంగన్వాడీ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొదురుపాక గ్రామానికి మంత్రిగా రాలేనని, మనుమడిగా వచ్చానన్నారు. హైదరాబాద్, కరీంనగర్లో విద్యాభ్యాసం చేసే సమయంలో తాతయ్య కొదురుపాకకు తీసుకువచ్చేవాడని గుర్తు చేసుకున్నారు. తాతయ్య చివరి చూపునకు నోచుకోలేదని, అమ్మమ్మ- తాతయ్య జోగినిపల్లి కేశవరావు- లక్ష్మీబాయి స్మారకార్థం ఇప్పటికే కొదురుపాకలో రైతు వేదిక కట్టామని కేటీఆర్.. రూ.2కోట్లతో ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణం తొమ్మిది నెలల్లో చేపడుతామన్నారు.
అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని, ప్రజల గుండెల్లో శ్వాశత స్థానం ఏర్పరుచుకోవడం ముఖ్యమన్నారు. దేశంలో అత్యుత్తమ 20 గ్రామ పంచాయతీల్లో 19 మనవేనని, దేశంలో అత్తుత్తమ మున్సిపాలిటీలో 26 మనవేనని, ఇది అందరికీ గర్వకారణమన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్లో రాజన్న సిరిసిల్ల దేశంలో ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. కరీంనగర్ రెండోస్థానంలో నిలిచిందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో సిరిసిల్ల సహా 33 జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుతో బడుగు బలహీన వర్గాల పిల్లలకు వైద్య విద్య అభ్యసిoచే అవకాశం కలిగిందన్నారు. తెలంగాణలో విద్యా ప్రమాణాలు బాగున్నాయన్నారు. 700పైగా గురుకులాలు పెట్టీ ఒక్కొకరికి లక్షా 20వేలు ఖర్చు చేసి 5 లక్షల విద్యార్థులకు విద్యనందిస్తున్నామన్నారు.
18వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఎనిమిదేళ్లలో చెల్లించామన్నారు. ‘మన ఊరు – మనబడి’ కింద మూడు దశల్లో రూ.7300కోట్లలో 26వేల ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ఇది వరకూ కరెంట్ ఉంటే వార్త.. ఇప్పుడు లేకపోతే వార్త అన్నారు. కేసీఆర్ కిట్ ద్వారా ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగ బిడ్డ పుడితే రూ.12వేల ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. రైతుబంధు ద్వారా రూ.63వేలకోట్ల రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక అన్ని రంగాల్లో మార్పు వచ్చిందన్నారు. అదే సమయంలో దేశ తలసరి సగటు లక్షా 49 వేలు మాత్రమేనని, సెస్ ఎన్నికల్లో మంచి విజయాన్ని కట్టబెట్టినందుకు ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు.