Minister KTR | హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్ర ప్రభు త్వం అంతులేని వివక్ష ప్రదర్శిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. తొమ్మిదేండ్లుగా రాష్ట్ర ప్రగతికి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రెండో దశ పర్యావరణ అనుమతులివ్వకుండా కేంద్రం పకన పెట్టిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ గురువారం మోదీ సర్కారుకు బహిరంగ లేఖ రాశారు. మంత్రి కేటీఆర్ లేఖ యథాతథంగా.. ‘తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షపూరిత వైఖరి పట్ల తీవ్ర నిరాశతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి స్వయంగా ప్రధానమంత్రి తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించే విధంగా పలుమార్లు మాట్లాడారు. కేంద్రం నుంచి ఎదురైన అన్ని రకాల ఆటంకాలను దాటుకొని రాష్ట్ర ప్రభుత్వం తనదైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తూ ముందుకుసాగుతున్నది. అయితే తెలంగాణ ప్రగతిని, పురోగతిని ఓర్వలేని కేంద్రం, తన పరిధిలో ఉన్న అంశాలను తేల్చకుండా తొమ్మిదేండ్లుగా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొనే ప్రయత్నం చేస్తూనే ఉన్నది.
తెలంగాణ నీటిపారుదుల ప్రాజెక్టుల విషయం లో.. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్రం తీవ్ర వివక్ష చూపుతున్నది. ఈ ప్రాజెక్టుకు రెండోదశ పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా కేంద్రం పకనపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కరువు పీడిత ప్రాంతాలైన నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, నారాయణపేట, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు ఈ ప్రాజెక్టు ఆశాకిరణం. 12.03 లక్షల ఎకరాలకు పైగా భూమికి సాగునీటికి, ప్రజలకు తాగునీటికి భరోసానిచ్చి, పరిశ్రమల నీటి అవసరాలను తీర్చే ఈ బహుళార్థ సాధక ప్రా జెక్టు నిర్మాణానికి కేంద్రం అడ్డంకులు సృష్టించడం శోచనీయం. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. కోట్లాది ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు వస్తుంది. నల్లగొం డ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలను మరింత సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు కరువుతో తల్లడిల్లిన ఈ జిల్లాలు పచ్చబడటం కేంద్రానికి ఇష్టం లేదు. అందుకే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడ్డు తగులుతున్నది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న తెలంగాణ ప్రజల డిమాండ్‌ను పెడచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వం, అనుమతుల పేరుతోనూ అడ్డంకులు సృష్టిస్తున్నది.
కేంద్రం కృష్ణా జలాల పంపిణీ, వినియోగంపై నాలుగు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తున్నది. దీంతో రాజ్యాంగబద్ధంగా నీటి వినియోగ అంశం రాష్ట్ర జాబితాలో ఉన్నా, కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా తన సొంత సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు వాడుకోలేని దుస్థితిలోకి తెలంగాణను నెట్టింది.
మరణించిన వారికి తుది వీడ్కోలు గౌరవప్రదంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభు త్వం సకల సౌకర్యాలతో వైకుంఠధామాలను ఏర్పాటు చేస్తున్నదని మంత్రి కేటీఆర్ గురువారం ట్వీట్ చేశారు. నిజామాబాద్‌లో నిర్మించిన నూతన వైకుంఠధామం ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. అన్ని మున్సిపాలిటీల్లో ఇలాంటి ఆధునిక వైకుంఠధామాలను నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు.
‘బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపూరిత, వివక్షాపూరిత వైఖరి దురదృష్టకరం. ఇతర రాష్ట్రాల మాదిరి ప్రజలు తమ అవసరాలు, అకాంక్షల మేరకు నిర్ణయాలు తీసుకొని, అభివృద్ధి పథంలో నడిచేందుకు సైతం కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేలా చేయాలనుకోవడం ముమ్మాటికీ తెలంగాణ ప్రజలను అవమానించడమే. దాదాపు దశాబ్ద కాలంగా కేంద్రం ఏ అంశంలోనూ సహకరించకున్నా అనేక రంగాల్లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెట్టడంలో విజయం సాధించాం. తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని అడ్డుకొనే ఎలాంటి శక్తులనైనా రాజీ పడకుండా ఎదురొంటాం. కేంద్ర ప్రభుత్వ పక్షపాత నిర్ణయాలు, వివక్షపూరిత వైఖరిని తెలంగాణ ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని మంత్రి కేటీఆర్ తన బహిరంగ లేఖలో పిలుపునిచ్చారు.