హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో పాత.. కొత్త తేడా లేకుండా నగరం నలువైపులా సమాంతరంగా అభివృద్ధి పనులు చేపట్టామని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. పాతబస్తీ ప్రగతికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో దాదాపు రూ.580 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా సర్దార్ మహల్ వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ.. పాతబస్తీలో ఉన్న వారసత్వ సంపదను భవిష్యత్తు తరాలకు పదిలంగా అందించడానికి చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు.
అందులో భాగంగా ముందుగా మోజంజాహి మార్కెట్‌ను అద్భుతంగా పునరుద్ధరించామని తెలిపారు. కులీకుతుబ్‌షా అర్బన్ డెవలప్మెంట్కు పూర్వవైభవం తెచ్చేందుకు చారిత్రక కట్టడాల పునరుద్ధరణ, ఇన్నోవేషన్ పనులను కేటాయించామని పేర్కొన్నారు. సర్దార్ మహల్‌ను పర్యాటకులు ఆకర్షించేవిధంగా ఒక మ్యూజియం, 12 గదులు గల హోటల్‌తో కల్చరల్ హబ్‌గా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రపంచ వారసత్వ సంపద దినోత్సవం జరిగిన మర్నాడే పురాతన హెరిటేజ్ భవనాల పునరుద్ధరణకు శంకుస్థాపనచేయడం పట్ల మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తంచేశారు. ఇప్పుడు జీహెచ్ఎంసీకి కానీ, అసెంబ్లీకి కానీ.. ఎలాంటి ఎన్నికలు లేవని.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకోకుండా.. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రూ.500 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టడం తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి కేటీఆర్ చెప్పారు.
అన్ని సమస్యల పరిష్కారం
పాతబస్తీలో శానిటేషన్ మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకొంటున్నామని.. ప్రస్తుతం 300 స్వచ్ఛ ఆటోలకు అదనంగా మరో 150 స్వచ్ఛ ఆటోలను కేటాయిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో తాగునీటి సమస్య, విద్యుత్తు సమస్య లేదన్నారు. మౌలిక సదుపాయాల కల్పనతోపాటు, 437 ఏండ్ల వారసత్వ సంపదను కాపాడుకొంటున్నామని చెప్పారు. పాతబస్తీతోపాటు.. జీహెచ్ఎంసీ పరిధిలో నోటరీతో ఉన్న ప్రాపర్టీపై హక్కు కల్పించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని, త్వరలో సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని పేర్కొన్నారు.
గతంలో ప్రభుత్వం జీవో 58,59 ఆధారంగా లక్షమందికి అవకాశం కల్పించామన్నారు. బహదూర్‌పురా ఫ్లైఓవర్‌కు ప్రముఖ వ్యక్తుల పేరు పెట్టాలన్న ఎంపీ అసదుద్దీన్ ప్రతిపాదనను మంత్రి కేటీఆర్ అంగీకరించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, రియాజుద్దీన్, వాణీదేవి, ఎమ్మెల్యేలు ముంతాజ్ అహ్మద్‌ఖాన్, మహ్మద్ మోజంఖాన్, కౌసర్ మొయినుద్దీన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్, ఈఎన్సీ జియావుద్దీన్, ప్రాజెక్టు సీఈ దేవానంద్, ఎస్ఈ దత్తుపంతు, సీసీపీ దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.