హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): టీ ప్రైడ్ (తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్స్) పథకం కిం ద దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్ఐఐసీ కేటాయిస్తున్న భూమి విలువపై 50 శాతం రాయితీ ఇస్తుండగా.. మిగిలిన 50 శాతానికి చెల్లించే వడ్డీని 16 శాతం నుంచి 4 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకొన్నది. ఈ మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటును కల్పిస్తున్నట్టు ఐటీ పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
సమాజంలో అట్టడుగున ఉన్న దళితవర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నదన్నారు. బుధవారం రాష్ట్ర పరిశ్రమలశాఖ, దళిత పారిశ్రామికవేత్తల సం ఘం సంయుక్తంగా నిర్వహించిన అంబేద్కర్ జయం తి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. 3,500 మం ది టీ-ప్రైడ్ లబ్ధిదారుల రాయితీలకు సంబంధించిన రూ.200 కోట్లను విడుదలచేశారు. అనంతరం మాట్లాడుతూ పీవీ మార్గ్‌లో.. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాం స్య విగ్రహం ఏర్పాటు పనులు ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తవుతాయని చెప్పారు. ఈ విగ్రహం దేశానికే తలమానికంగా నిలవనున్నదని తెలిపారు. పర్యాటకులను ఆకర్షించేలా ధ్యాన మందిరం, మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
తెలంగాణ మొదట్నుంచీ అంబేద్కర్ బాటలో పయనిస్తూ మిగతా రాష్ర్టాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఎవరు విఘాతం కల్పించినా.. కేంద్రం అడ్డంకు లు సృష్టించినా పోరాడుతామని తెలిపారు. బోధించు, సమీకరించు, పోరాడు అన్న అంబేద్కర్ సూక్తులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకళింపుచేసుకొని.. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ.. 14 ఏండ్లపాటు పోరాడి తెలంగాణ సాధించారని గుర్తుచేశారు. మెజార్టీ సభ్యులు అడ్డుకొన్నంతకాలం మైనార్టీలకు న్యాయం జరుగదని అంబేద్కర్ ఆనాడే చెప్పారని.. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏనాడూ తెలంగాణ ఏర్పాటు తీర్మానం ఆమోదం పొందేది కాదన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ సాకారమైందని పేర్కొన్నారు. ప్రపంచంలో పైసలున్నోడు, లేనోడు అనే రెండే కులాలున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. అగ్రవర్ణాల్లో సైతం ధనికులు పేదలను పట్టించుకోరని, దళితులు, గిరిజనులు, బీసీల్లోనూ ఇదే విధంగా ఉన్నదని చెప్పారు. సమానత్వం ఉండే సమాజం ఏర్పడాలంటే ‘ఫైట్ క్యాస్ట్ విత్ క్యాపిటల్’ అనే ఫార్ములా పాటించాలని, సంపద సృష్టించి దాన్ని సమానంగా పంచగలిగినప్పుడే సమానత్వం వస్తుందన్నారు. ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తున్నదని, వాటిని అందిపుచ్చుకొని ముందుకుపోయే తెలివి మనం కల్పించుకోవాలని సూచించారు. ఆశయం గొప్పదై, నేను ఎవ్వరికీ తక్కువకాదు అనే భావన ఉంటే ఎంతైనా సాధించవచ్చన్నారు.
చైనా, ఇండియాల జీడీపీలు 1987లో 470 బిలియన్ డాలర్లు కాగా, ఇప్పుడు చైనా జీడీపీ 16 ట్రిలియన్ డాలర్లని, మనది 2.9 ట్రిలియన్ డాలర్లు మాత్రమేనని మంత్రి కేటీఆర్ చెప్పారు. అక్కడ వ్యవసా యం, తయారీ రంగం, పారిశ్రామికరంగం సమగ్రంగా అభివృద్ధి కావడంతో 35 ఏండ్లలోనే అమెరికాతో పోటీపడే స్థాయికి చేరిందని తెలిపారు. మనం ఇంకా పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ అనుకుంటూ.. ఎవరు ఏం తింటున్నారు, ఏం కట్టుకుంటున్నారు అనే యావే తప్ప ముందుకు పోదామనే ఆలోచన లేదని విమర్శించారు. ప్రజలను ముందుకు తీసుకెళ్లేలా కేంద్ర ప్రభు త్వం అవకాశాలు కల్పించాలని తెలిపారు.
మెట్రో వాటర్‌బోర్డులో 100 జెట్టింగ్ మిషన్లు దళితులకు ఇచ్చినట్టు, కాంట్రాక్టుల్లో, వైన్ షాపుల్లో రిజర్వేషన్ కల్పించినట్టు మంత్రి కేటీఆర్ చెప్పారు. టీ-ప్రైడ్ వంటి పథకం దేశంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని, ఉన్నంతకాలంలో ఏమి చేశామన్నదే ముఖ్యమని తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, టీ-ప్రైడ్ తదితర పథకాలు చరిత్రాత్మకమైనవన్నారు. ఒకప్పుడు సంపన్నులకే పరిమితమైన ఇండియన్ బిజినెస్ స్కూల్ నేడు వంద మంది దళిత, గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రవేశం కల్పించిందన్నారు. మనం సొంతకాళ్లపై నిలబడటమే కాకుండా పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని కోరారు. దళితబంధు సక్సెస్ స్టోరీలపై డాక్యుమెంటరీలు రూపొందిస్తామన్నారు.
75 ఏండ్ల చరిత్రలో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, కేంద్రం ఒక్క పైసా ఇవ్వకున్నా చేసి చూపించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేంద్రం మాత్రం హర్ ఘర్ జల్ అంటూ ఎవ్వరికీ నీళ్లు ఇవ్వకుండానే ప్రచారం ఘనంగా చేసుకుంటున్నదని ఎద్దేవాచేశారు. తాము చేస్తున్నవి పేపర్లు, టీవీలు కూడా చూపించవని.. హిందూ, ముస్లిం వివాదాలను మా త్రం ప్రత్యేకంగా మీడియా చూపిస్తున్నదని చెప్పారు. వాట్సాప్‌ల్లో పనికిమాలినవాటిని ప్రచారం చేసేకన్నా పాజిటివిటినీ ప్రచారం చేసేలా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, డిక్కీ అఖిల భారత అధ్యక్షుడు నర్రా రవికుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పలువురు ఉత్తమ దళిత పారిశ్రామికవేత్తలకు బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవార్డులను ప్రదానం చేశారు.
సుమారు రూ.17,500 కోట్ల రూపాయలతో సీఎం కేసీఆర్ దళితబంధు కార్యక్రమాన్ని చేపట్టారని, దీని స్ఫూర్తిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐదేండ్లలో క్రమంగా దళితుల్లోని పేదరికాన్ని రూపుమాపే కార్యక్రమం దళితబంధు అని, దీన్ని సద్వినియోగం చేసుకోకుంటే చారిత్రక తప్పిదమవుతుందని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్లను మోడల్‌గా తీసుకొని అక్కడ దళితబంధు కార్యక్రమాన్ని సమర్థంగా అమలుచేయాలని డిక్కీ సభ్యులకు మంత్రి సూచించారు. అందరూ ఒక్కటే ఎంచుకోకుండా రాష్ట్రంలోని 14 ప్రాధాన్యరంగాల్లో నచ్చినదానిని ఎంచుకొని ముందుకు సాగాలన్నారు.
‘నేను నిజాం కాలేజ్‌లో చదువుతున్నప్పుడు ఇద్దరు మిత్రులు ఉండేవారు. సుమిత్, జాన్సన్ వారి పేర్లు. జాన్సన్ క్రిస్టియన్ అని పేరుతోనే తెలుస్తుంది. అప్పుడు మా నాన్న రవాణాశాఖ మంత్రిగా ఉన్నారు. ఒకరోజు సుమిత్ నా వద్దకు వచ్చి మా అక్క ఆర్టీసీలో ఉద్యోగానికి దరఖాస్తు చేసింది, మీ నాన్నతో ఒక సిఫారసు చేయించు అని కోరాడు. నేను నాన్నకి చెప్తే ఆయన పీఏకి చెప్పారు. ఆ తరువాత అది రిజర్వు క్యాటగిరీలోని బ్యాక్లాగ్ పోస్ట్ అని, దరఖాస్తుదారు ఏమి కులమో తెలుసుకోవాలని పీఏ నాతో అన్నారు. అప్పటివరకు వాళ్ల కులం ఏమిటో నాకు తెలియదు. నేను అతని కులం అడిగితే ఎస్సీ అని చెప్పాడు. మరో స్నేహితుడు జాన్సన్ రాథోడ్ ఇప్పుడు అమెరికాలో ఐటీ కన్సల్టెంటుగా పనిచేస్తూ వందలమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాడు. మొన్న అమెరికా వెళ్లినప్పుడు కలిసి తన కారులోనే అక్కడ తిప్పాడు’