KTR | యాదాద్రి భువనగిరి, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): సింహంలాంటి కేసీఆర్ కావాలో? సీల్డ్ కవర్లో వచ్చే సీఎం కావాలో తేల్చుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను ఫ్లోరోసిస్‌తో నాశనం చేసిన దరిద్రం కాంగ్రెస్‌దేనని ఆరోపించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అంటే ఆరు నెలలకో సీఎం అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఉండగా తెలంగాణకు సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అవసరం లేదని తేల్చి చెప్పారు. మంగళవారం నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాలలో ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్యకు మద్దతుగా కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారో కూడా తెలియదని విమర్శించారు. పోటీలో లేని జానారెడ్డి కూడా తాను సీఎం అవుతానని అంటున్నారని, గెలవకపోతే గడ్డం తీయబోనని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారని ఎద్దేవా చేశారు.
జనంలో లేని కాంగ్రెస్, బీజేపీ నేతలు సంక్రాంతి గంగిరెద్దుల్లా వస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. బక్క పలుచని కేసీఆర్‌ను ఓడించేందుకు ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక నుంచి దండయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ, అమిత్‌షా, యోగి ఆదిత్యనాథ్‌తోపాటు 15 మంది కేంద్రమంత్రులు, సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక, కర్ణాటక కాంగ్రెస్ నేతలు వస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో వారికి నాయకులే లేరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నాణ్యతలేని కరెంట్, కాలిపోయే మోటార్లు, ఎరువులు, విత్తనాల కొరత తప్పదని హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే తెల్లరేషన్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ‘కేసీఆర్ బీమా-కుటుంబానికి ధీమా’ పథకంతోపాటు సన్నబియ్యం పంపిణీ చేస్తామని, 18 ఏండ్లు నిండిన అర్హులైన ఆడబిడ్డలకు ప్రతినెల రూ. 3,000 చొప్పున ఖాతాలో జమచేస్తామని చెప్పారు. డిసెంబరు 3 తర్వాత వంటగ్యాస్‌ను రూ. 400కే అందిస్తామని, రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామని వివరించారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ డబ్బు మదంతో మిడిసిపడుతున్నారని, వారికి ఓటమి తప్పదని మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమైపోయిందని, నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్య గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగులు లింగయ్యయాదవ్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లగొండ, యాదాద్రి జడ్పీ చైర్మన్లు బండ నరేందర్‌రెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు చెరుకు సుధాకర్, చాడ కిషన్‌రెడ్డి, గుత్తా అమిత్‌రెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.