అందమైన నినాదాలు తప్ప..ఫెడరల్ స్ఫూర్తి శూన్యం
కేంద్ర వైఖరిపై నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్, మార్చి 10 : అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్న తెలంగాణకు కేంద్రం సహకరించకపోగా వివక్ష చూపుతున్నదని పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
అభివృద్ధిలో రాజకీయం వద్దు
ప్రగతిపథంలో ముందుకెళ్తున్న తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం చేయూతనివ్వాలి. హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నాగ్‌పూర్, హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లు ఇవ్వాలని పలుసార్లు ఉత్తరాలు రాశాం. ఇప్పటికీ ఉలుకూ పలుకూ లేదు. హైదరాబాద్‌లో చాలా రక్షణ రంగ సంస్థలు ఆనాటి కాంగ్రెస్ప్రభుత్వాల నుంచి ఉన్నాయి. మన దగ్గర అద్భుతమైన రక్షణ రంగ ఎకోసిస్టం ఉంటుంది. ఆత్మనిర్భర భారత్‌లో కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ పెడుతుందని తెలిసి, అది హైదరాబాద్-బెంగళూరు మధ్య వస్తుంది. దీనివల్ల మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం లాంటి వెనుకబడిజిల్లాలకు లాభం అవుతుందనుకున్నాం. కానీ, ‘దాన్ని బుందేల్‌ఖండ్‌లో పెడుతున్నం.. ఇప్పటికే ప్రధాని దీనిపై నిర్ణయం తీసుకొన్నారు’అని అప్పటి రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. తర్వాత ఆరా తీస్తే తెలిసిందేమంటే..మన దగ్గర కేవలం 17 పార్లమెంట్ సీట్లు ఉన్నయి..అక్కడ 80 సీట్లు ఉన్నయి. వాళ్లకు ఎలక్షన్లో లాభమైతదని అక్కడ పెట్టుకున్నట్టు తెలిసింది. రాజకీయపరమైన కారణాలతో అభివృద్ధిని అడ్డుకోవడం ఎంత వరకు సబబు? ఇదేనా సబ్‌కాసాత్.. సబ్కా వికాస్.. కో ఆపరేటివ్ ఫెడరలిజం?
ఏండ్లు గడిచినా నిధులేవీ?
జహీరాబాద్ నిమ్జ్‌కు ఆరేండ్లలో రూ.3 కోట్లు ఇచ్చారని, హైదరాబాద్ ఫార్మాసిటీ నిమ్జ్‌కు రూ.5 కోట్లు ఇచ్చారని కేంద్రం తీరుపై మంత్రి కేటీఆర్ విమర్శించారు. సబ్‌కాసాత్.. సబ్కా వికాస్.. ఫిట్ ఇండియా.. సిట్ ఇండియా.. డిజిటల్ ఇండియా.. స్టార్టప్ ఇండియా.. మేకిన్ ఇండియా.. స్టాండప్ ఇండియా.. అంటూ కేంద్ర ప్రభుత్వం అందమైన నినాదాలు చెప్తుందే తప్ప దాని వెనుక ఏం పాలసీకానీ, సపోర్ట్కానీ ఉండదు. కరోనా సమయంలో ఆత్మనిర్భర్ భారత్‌తో ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీతో లాభం పొందినవారు ఎవరూ లేరు. అదంతా కేవలం ఒక జుమ్లా. అచ్చేదిన్ అని ప్రధాని మోదీ అన్నారు. కానీ పరిశ్రమలకు సచ్చేదిన్ వచ్చాయి.
ఐటీలో మనమే మేటి
తెలంగాణ ఏర్పడ్డనాడు ఐటీ ఎగుమతులు మన రాష్ట్రం నుంచి 57 వేల కోట్లు, ఐటీ రంగంలో ప్రత్యక్ష ఉద్యోగులు 3 లక్షల మంది..ఏడేండ్ల తర్వాత అంటే 2021 జూన్ వరకు లక్ష 45 వేల కోట్లకు ఐటీ ఎగుమతులు చేరుకొన్నాయి. ఐటీ ఉద్యోగులు 6 లక్షల 29వేల మంది పనిచేస్తున్నారు. భారత దేశం సగటు కంటే 4 నుంచి 5 శాతం ఎక్కువగా తెలంగాణ పెరుగుతున్నది.
మా ఆదాయంతో దేశాన్ని సాదుతున్నాం
భారతదేశ ఆర్థికరంగానికి దన్నుగా నాలుగో అతిపెద్ద ఆర్థిక చోదక శక్తిగా తెలంగాణ ఉన్నదని స్వయంగా ఆర్బీఐ వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రాం ఇప్లిమెంటేషన్ గణాంకాలు చెప్తున్నాయి. ఇది కేసీఆర్ ప్రభుత్వం ఘనతకాదా? మా నాయకుడి దక్షత కాదా? తలసరి ఆదాయం 130% పెరిగింది. ఇది వాస్తవం కాదా? జీఎస్డీపీ19%పైగా వృద్ధిరేటుతో తెలంగాణ ప్రగతిపథాన ముందుకెళ్తున్నది. అందుకే కొందరికి కడుపులో ఏదోలా ఉంటున్నది. దేశ జనాభాలో తెలంగాణ కేవలం 2.5శాతం మాత్రమే. కానీ, దేశ జీడీపీకి 5% ఇస్తున్నాం. కాంగ్రెస్‌పాలిత రాజస్థాన్‌కు, బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌కు అన్నంపెడుతున్న రాష్ర్టాల్లో, దేశాన్ని సాదుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ ఉన్నది.