కరెంటు కావాల్నా.. కాంగ్రెస్ కావాల్నా?
రైతుబంధు కావాల్నా.. రాబందు కావాల్నా?
నీళ్లు కావాల్నా.. కన్నీళ్లు కావాల్నా?
స్కీములు కావాల్నా.. స్కాములు కావాల్నా?
జనంలో ఉండే ఎమ్మెల్యే కావాల్నా?
జైలుకుపోయే ఎమ్మెల్యే కావాల్నా?
ప్రజలే తేల్చుకోవాలి
– మంత్రి కేటీఆర్
Minister KTR | వికారాబాద్, నవంబర్ 9, (నమస్తే తెలంగాణ): జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా? జైలుకెళ్లే దొంగ కావాలా.. నీళ్లు కావాలా? కన్నీళ్లు కావాలా? కేసీఆర్ పెట్టిన స్కీములు కావాలా? లేక కాంగ్రెస్ స్కాములు కావాలా.. ఆలోచించుకోవాలని రైతులు, ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంత్రి కేటీఆర్ గురువారం తాను పోటీచేస్తున్న సిరిసిల్లలో నిరాడంబరంగా నామినేషన్ వేశారు. అనంతరం ఆర్మూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు.
ఆ తరువాత కొడంగల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డికి మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.50 లక్షలతో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్‌రెడ్డి అని, తొందర్లోనే జైలుకెళ్లి చిప్పకూడు తినడం ఖాయమని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొడంగల్ పరువు తీసిన దొంగ రేవంత్ అని మండిపడ్డారు. ఏదో సామెత చెప్పినట్టు తెగబలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడగొట్టినట్టుగా రేవంత్‌రెడ్డి.. సీఎం కేసీఆర్‌తో పోటీ పడ్తున్నాడని, ముందు కొడంగల్‌లో నరేందర్రెడ్డిపై గెలిచి చూపించాలని సవాల్ చేశారు. 20 ఏండ్ల క్రితం రేవంత్‌రెడ్డి గోడలకు సున్నాలు వేసుకొని బతికే వాడని, బ్లాక్మెయిల్, బ్రోకర్, సెటిల్మెంట్ దందాలతో కోట్లు సంపాదించిన చిల్లర దొంగ అంటూ విరుచుకుపడ్డారు. పీసీసీ పదవిని కొనుక్కొని, కాంగ్రెస్ టికెట్లను అమ్ముకొని సొమ్ము చేసుకొంటున్నాడని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి లీడర్లను కొనవచ్చేమో గానీ తెలంగాణ బిడ్డలను కొనే దమ్ము లేదని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు దొంగ రేవంత్‌రెడ్డి వస్తే.. కొడంగల్‌ను ప్లాట్లు చేసి అమ్ముకుంటాడని దుయ్యబట్టారు.
కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పోయిందని, కాంగ్రెస్‌ను గెలిపించుకున్నందుకు కన్నడ ప్రజలు నేడు చెంపలేసుకుంటున్నారని, తెలంగాణ బిడ్డలు ఆ తప్పు చేయవద్దని కన్నడ ప్రజలు ఇక్కడికి వచ్చి విజ్ఞప్తి చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వికారాబాద్ జిల్లా, తాండూర్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్‌ను గెలిపిస్తే 5 గంటల కరెంటు ఇస్తామని చెప్పడంతో ప్రజలు సభ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే 24 గంటల కరెంటు సరఫరా కొనసాగుతుంటే, కాంగ్రెసోళ్లు 5 గంటల కరెంటు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి కూడా ఇదే బాపతని, వ్యవసాయానికి 3 గంటల కరెంటు సరిపోతుందన్న ప్రబుద్ధుడని ఎద్దేవా చేశారు. సిగ్గులేని కాంగ్రెస్ తెలంగాణను తామే ఇచ్చామని చెప్పుకొంటున్నదని, ఎంతోమంది బిడ్డల బలిదానంతోనే తెలంగాణ సాధ్యపడిందని గుర్తుచేశారు.
‘వందల మంది చావులతో బంధవిముక్తులైన మన తెలంగాణను ఢిల్లీ, గుజరాత్ గులాంల చేతుల్లో పెడితే వాళ్ల మోచేతి నీళ్లు తాగే దుస్థితి వస్తుంది. ఒకనాటి కాకతీయ సామ్రాజ్యం కావాలా? కర్ణాటక సామంతుల రాజ్యం కావాలా?. మనమంతా కుటుంబ సభ్యులం.. ఇంట్లో చిన్నచిన్న తగాదాలుంటే మనమే పరిష్కరించుకోవాలి. తియ్యటి మాటలు చెప్పి.. ప్రలోభాలకు లొంగితే దీర్ఘకాలం బాధపడాల్సి వస్తుంది’.
– కేటీఆర్
తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ చెప్పారు. రైతుబంధు కావాలా.. రాబందులు కావాలా.? ప్రజల మధ్యన ఉండే నాయకుడు కావాలా? చేతులూపే నాయకుడు కావాలో ప్రజలు తేల్చుకోవాలని కోరారు. ఈ రోడ్ షోలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి, షాబాద్ జడ్పీటీసీ అవినాష్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తొమ్మిదిన్నర ఏండ్లుగా కులమనే కుంపట్లు, మంతంపేరుతో మంటలు కేసీఆర్ పెట్టలేదని కేటీఆర్ గుర్తుచేశారు. కేవలం అభివృద్ధే కులం, సంక్షేమమే మతమంటూ సబ్బండవర్గాల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. ఎన్నికలు రాగానే ఈ రోజు కొందరు కులమంటూ, మరికొందరు మతమంటూ వస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమమే నా కులమంటున్న కేసీఆర్‌ను గెలిపిద్దామా? లేక కులపిచ్చోళ్లు, మతపిచ్చోళ్లున్న ప్రతిపక్షాల ఉచ్చులో పడి ప్రమాదాన్ని కొనితెచ్చుకుద్దామా? అన్ని ప్రశ్నించారు. తనకు రాజకీయ భిక్షనిచ్చిన సిరిసిల్లను మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. సిరిసిల్ల ప్రజలు గర్వంగా తలఎత్తుకునే విధంగా రాష్ట్రంలోనే జిల్లాను అభివృద్ధిలో ముందుండేలా చేశానని తెలిపారు. ప్రతి ఒక్కరూ తామే అభ్యర్థినని అనుకొని నాలుగుసార్లు ఇక్కడి ప్రజలు గెలిపించారని చెప్పారు. ఐదోసారి జరుగుతున్న ఎన్నికల్లోనూ తమ బిడ్డగా ఆశీర్వదించి భారీ మెజార్టీ అందించాలని కోరారు.
‘బక్క పలుచని కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు మోదీ, అమిత్‌షా, 15 మంది ముఖ్యమంత్రులు, 15 మంది కేంద్ర మంత్రులు, రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ ఇలా ఎందరో ఢిల్లీ నుంచి వస్తున్నారు. ఎందరొచ్చినా భయపడేదిలేదు. రెండు సార్లు ఒంటరిగానే ఎదుర్కొన్నాం. ఇప్పుడూ సింగిల్ గానే ముందుకుపోతాం. ఒక్క చాన్స్ కావాలని కాంగ్రెస్ వారు కోరుతున్నారు, ఇప్పటి వరకూ 11 సార్లు వారికి అవకాశం ఇస్తే ఏం చేశారు? ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్లకు కర్ణాటక నుంచి బీజేపీ వాళ్లకు గుజరాత్ నుంచి డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బుతో మాయమాటలు చెప్పి ఓట్ల కోసం కుట్రలు చేయనున్నారు. వారి కుట్రలను ప్రజలు ఓట్లతో తిప్పికొట్టాలి. సంక్రాంతి పండుగకు గంగిరెద్దులోల్ల మాదిరిగా కాంగ్రెస్ నాయకులు ఊరూరుకు వస్తున్నారు. 50 సంవత్సరాలు అధికారంలో ఉండి కరెంటు, సాగునీరు ఇవ్వక ఎంతో గోసపెట్టి గొంతెండపెట్టినోళ్లు ఇప్పుడు వచ్చి మాయమాటలు చెప్తే నమ్మి మోసపోవద్దు. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి!’
-కేటీఆర్