Minister KTR | కొడంగల్‌లో ఈసారి నరేందర్‌రెడ్డిని గెలిపించిన తర్వాత.. అవసరమైతే కేసీఆర్ కాళ్లు పట్టుకుని అయినా సరే ఎమ్మెల్యేకు ప్రమోషన్ ఇప్పిచ్చే బాధ్యత తనది అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అప్పుడు కొడంగల్ ప్రజలకు ఏ ఢోకా ఉండదన్నారు. కొడంగల్‌లో గురువారం నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీకు ఏది కావాలంటే అది నరేందర్ రెడ్డే చేసే స్థాయికి తీసుకొచ్చే బాధ్యత తనదని రెండోసారి పునరుద్ఘాటించారు. కొడంగల్‌లో ఉత్సాహం చూస్తుంటే.. అది ఎలక్షన్ ర్యాలీ లెక్క లేదని.. గెలిచినంక తీస్తున్న ర్యాలీలా ఉందని కేటీఆర్ అన్నారు. యాడున్నడో కానీ.. ఇదంతా రేవంత్ రెడ్డి మనుషులు కూడా చూస్తున్నారని.. ఈ లొల్లి అంత చూసి తర్వాత.. మల్ల ఎందుకు ఓడిపోవాలని ఈ నెల 15న రేవంత్ రెడ్డి నామినేషన్ వెనక్కి తీసుకున్నా తీసుకుంటాడని ఎద్దేవా చేశారు.
‘ తొమ్మిదిన్నరేండ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఒకవైపు పేదలను కడుపులో పెట్టుకుని చూసుకుంటూనే.. మరోవైపు అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా ముందుకు పోతుంది. పక్కనే ఉన్న కర్ణాటకలో ప్రజలు చెంపలేసుకుంటున్నరు. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది.. అక్కడి నుంచి ఇక్కడికి రైతులు వచ్చి.. మేమే తప్పు చేసినం.. బుద్ధితక్కువ పని చేసినం.. మీరు పొరపాటున ఆ పనిచేసేరు. నాశనం అయితరు. దయచేసి ఆ పని మాత్రం చేయకండి అని చెబుతున్నారు. కర్ణాటక రైతులు కొడంగల్ వచ్చి.. ధర్నాలు చేస్తున్నారు. కర్ణాటకలో పరిస్థితిని చూస్తూనే ఉన్నారు. కరెంటు లేక చెరువులు ఎండిపోయి.. బోర్లు ఎత్తిపోయి.. ఆఖరికి చెరువుల్లో ఉండే మొసళ్లను తీసుకెళ్లి సబ్స్టేషన్లలో విడిచిపెట్టే పరిస్థితి ఇయ్యాళ కర్ణాటకలో ఉన్నది. నిన్నగాక మొన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకేశివకుమార్ మన వికారాబాద్ జిల్లా తాండూర్‌కు వచ్చిండు. వచ్చి అక్కడ చెబుతుండు. మీరు మాకు ఓటేస్తే.. మీకు కూడా 5 గంటల కరెంటు ఇస్తామని సిగ్గు లేకుండా చెబుతున్నడు. తాండూరులో అందరూ పరేషన్ అయ్యిండ్రు. 24 గంటల కరెంటు ఎత్తగొట్టి.. 5 గంటల కరెంటు ఇస్తాడంట.. వీడు యాడికెళ్లి వచ్చిండంటూ నెత్తికొట్టుకుని పోయిండ్రు.’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
కొడంగల్ పరువును, ప్రతిష్ఠను, పేరును అంతర్జాతీయంగా చెడగొట్టినోడు రేవంత్ రెడ్డి అని అన్నారు. 50 లక్షల రూపాయలతో అడ్డంగా దొరికిన దొంగ, 420, ఒక చిల్లరగాడు రేవంత్ రెడ్డి అని అన్నారు. ఇవాళ వాడు కూడా వచ్చి మాట్లాడుతున్నాడని.. కేసీఆర్ నువ్వు ఈడికి వస్తవా? నేనే కామారెడ్డికి రావాల్నా అంటున్నాడని అన్నారు. ఇది చూస్తుంటే తెగబలిసిన కోడి చికెన్ షాపుకి పోయి తొడ కొట్టిందనే సామెత గుర్తొస్తుందని అన్నారు. రేవంత్ రెడ్డి నీకు కేసీఆర్ అవసరం లేదు. మా నరేందర్ అన్న చాలు.. రెండోసారి కూడా పక్కగా ఓడగొడతాడు. గన్‌షాట్ గెలుస్తాడని సవాలు విసిరారు. ఈసారి నరేందర్ అన్నకు ప్రమోషన్ ఇప్పించి.. కొడంగల్‌ను అద్భుతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.