KTR | మహబూబ్నగర్ : ఒకనాడు పాలమూరు అంటే మైగ్రేషన్.. ఇప్పుడు పాలమూరు అంటే ఇరిగేషన్ అని ఒక్క మాటలో చెప్పొచ్చు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఒకప్పుడు పల్లె పల్లెన పల్లెర్లు మొలిచే పాలమూరులోనా అని పాటలు పాడుకున్నాం.. కానీ ఇప్పుడు పసిడి పంటలు పండుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఇవాళ తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో కొత్త చరిత్ర సృష్టిస్తోంది. కృష్ణా నదితో పాలమూరకు జీవం పోసి, పంటలు పండుతుంటే కొందరికి కండ్లు మండుతున్నాయి. ఇది కొందరికి నచ్చడం లేదు. ఇప్పుడు పాలమూరుకు వలస కూలీలు రావడం నచ్చడం లేదు. అన్ని నియోజకవర్గాలకు నీళ్లు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.
కొద్ది నెలల క్రితం గద్వాలకు పోయినప్పుడు ఓ పత్తి చేనులో ఉన్న 60 మంది కూలీలతో మాట్లాడిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఆ కూలీల్లో చాలా మంది కర్నూల్ కూలీలు ఉన్నారు. గద్వాల, అలంపూర్ వాళ్లు ఉన్నారేమోనని అడిగాను. మరొకరిని అడిగితే రాయిచూర్ అని చెప్పారు. ఒకప్పుడు పాలమూరు కూలీలు పొట్ట చేత పెట్టుకుని బొంబాయి బస్సెక్కి వలసకు పోయేవారు. దేశంలో ఎక్కడ పని ఉన్నా పోయేవారు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఇతర రాష్ట్రాల కూలీలు మన వద్దకు వలస వస్తున్నారు. ఇది పాలమూరు సాధించిన ప్రగతి కాదా..? బీడు భూములు మాగాణాలు అవుతున్నాయి. నాడు ఎక్కడ చూసిన కరువు, కన్నీళ్లు.. ఇప్పుడు ఎక్కడ చూసిన చెరువులు, నీళ్లు అని కేటీఆర్ పేర్కొన్నారు.
అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం రాష్ట్రాన్ని తెచ్చిన ముఖమంత్రి ఉన్నారు. మీ ఆశీర్వాదంతోనే కేసీఆర్ ఢిల్లీకి పోయి రాష్ట్రాన్ని తెచ్చిండు. కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు. బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి. ఇవాళ రైతులను కడుపులో పెట్టుకుంటున్నాం. 75 ఏండ్లలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా వ్యవసాయాన్ని పండుగ చేసిండు కేసీఆర్. పాలమూరులో ఎక్కడికక్కడ పచ్చని పంటలు పండుతున్నారు. ఇవాళ తెచ్చుకున్న తెలంగాణ ఎలా మారిందో ఎంత బాగయిందో చెప్పడానికి పాలమూరే ఒక మచ్చుతునక అని కేటీఆర్ తెలిపారు.
ఒకనాడు వలసల బతుకుల గడ్డ.. ఇవాళ పరిశ్రమలకు అడ్డాగా మారింది అని కేటీఆర్ పేర్కొన్నారు. అమరరాజా కంపెనీ పెట్టనున్న రూ. 9,500 కోట్ల పెట్టుబడికి భూమి పూజ చేశాం. ఒకప్పుడు పాలమూరులో పరిశ్రమలు లేవు. చదవుకున్న పిల్లలకు కొలువులు లేవు. అలాంటి పాలమూరులో ఇండస్ట్రీయల్ ఖిల్లాగా మారుతుందంటే అది మనకు గర్వకారణం కాదా..? ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఇచ్చాం. ఒక్క జూనియర్ కాలేజీ కోసం వందల దరఖాస్తులు పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి సమస్య లేదు అని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ వచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం. చెరవులను అభివృద్ధి చేశామని కేటీఆర్ చెప్పారు. ఒక్క మహబూబ్నగర్ పట్టణానికి దివిటిపల్లి అవతల కరివెన రిజర్వాయర్, ఇటు కిందికి ఉద్ధండాపూర్ రిజర్వాయర్ నిర్మిస్తున్నాం. ఈ రెండు రిజర్వాయర్లలో ఈ ఆగస్టులో 33 టీఎంసీల నీటిని నింపబోతున్నాం. ఈ ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
సీఎం కేసీఆర్కు పాలమూరు అంటే ఎంతో ప్రేమ. నూతన సచివాలయంలో అడుగుపెట్టిన తర్వాత పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలపై సీఎం సమీక్ష నిర్వహించారు. కేసీఆర్కు పాలమూరుపై ఉన్న ప్రేమకు ఆ సమీక్షనే నిదర్శనం. ఉమ్మడి జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందబోతోంది. మహబూబ్నగర్ పట్టణంలో తాగునీటికి ఇబ్బందులు లేవు అని కేటీఆర్ వివరించారు.