Minister KTR | హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఎవరెన్ని కుట్రలు చేసినా, విషప్రచారం చేసినా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయమని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం ఓ టీవీ చానల్ డిబేట్లో పాల్గొన్నారు. ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పక్కాగా 80 స్థానాలు గెలుచుకుంటుందని, మరింత కష్టపడితే గతంలో సాధించిన 88 స్థానాలను కూడా కైవసం చేసుకుంటుందని తెలిపారు.
సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించి దక్షిణాది రాష్ర్టాల్లో చరిత్ర సృష్టిస్తారని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో సకల దరిద్రాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని మండిపడ్డారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వలేదని, తెలంగాణ ప్రజలు అలుపెరగని పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించుకున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హవా అనేది లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్, బీజేపీ కేవలం రెండు స్థానాల కోసమే పోటీపడుతున్నాయని అన్నారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ పాతరోజులే వస్తాయని, రైతులకు క్రాప్ హాలిడేలు, పరిశ్రమలకు పవర్ హాలిడేలు తప్పవని హెచ్చరించారు. కర్ణాటకలోని ప్రస్తుత పరిస్థితులే అందుకు నిదర్శనమని ఉదహరించారు. కరెంటు ఇవ్వలేకపోతున్నామని, అభివృద్ధికి నిధులు లేవని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమారే స్వయంగా ప్రకటిస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ ప్రజానీకానికి బీఆర్ఎస్పై, సీఎం కేసీఆర్‌పై సంపూర్ణ విశ్వాసం ఉన్నదని తెలిపారు.
కేసీఆర్ గొప్ప అడ్మినిస్ట్రేటర్
కేసీఆర్ చాలా గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని కేటీఆర్ వివరించారు. మొదటి టర్మ్‌లో ఎలా పాలన కొనసాగించారో? రెండో టర్మ్‌లోనూ అదేవిధంగా పాలన కొనసాగించారని తెలిపారు. ఎమ్మెల్యేలకు పరిమితికి మించి స్వేచ్ఛను ఇచ్చారని వెల్లడించారు. కేసీఆర్‌తో సరితూగే నాయకుడు లేరని, ఆయన కంటే మెరుగైన పాలన అందించే నాయకుడు ప్రస్తుత రాజకీయాల్లో లేరని, రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్పై వ్యతిరేకత పెంచుతున్నది రాజకీయ వ్యూహకర్తలే
రాష్ట్రంలో బీఆర్ఎస్ బలంగా ఉన్నదని కేటీఆర్ తెలిపారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, గులాబీ పార్టీవైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్పై వ్యతిరేకత ఉన్నదంటూ వస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని, ఏ ప్రాతిపదిక లేకుండానే కొందరు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తలే బీఆర్ఎస్పై కృత్రిమ వ్యతిరేకతను సృష్టిస్తున్నారని, కావాలనే పదిమందిని పోగుచేసి బీఆర్ఎస్ అభ్యర్థులను అడ్డుకుంటూ ఆ వీడియోలను ట్రోల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. పేపర్ లీకేజీ సంఘటనలను కూడా రాజకీయం చేశారని మండిపడ్డారు. పార్టీలో అలకలు, అసంతృప్తులు సహజమేనని, అయినప్పటికీ ఓట్లు బీఆర్ఎస్కు గుద్దుడు గుద్దుడేనని అన్నారు.
కాంగ్రెస్ అహంకారం వల్లే విలీనం చేయలేదు
కాంగ్రెస్ అహంకారం వల్లే బీఆర్ఎస్ను ఆ పార్టీలో విలీనం చేయలేదని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ఆ రోజు అనుకున్నామని, అయితే కాంగ్రెస్ అధినేతల తీరుతోనే విలీనం చేయలేదని వివరించారు. దశాబ్దాలుగా తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొని పోరాడిన, పనిచేసిన నాయకులు, ఉద్యమకారులు, భవిష్యత్తుకు ఎలాంటి భరోసా ఇస్తారో చెప్పాలని అనాడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని, రాహుల్‌గాంధీని, దిగ్విజయ్‌సింగ్‌ను కేసీఆర్ అడిగారని తెలిపారు. అయితే కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఉద్యమకారులకు, నాయకత్వానికి మాత్రం ఎలాంటి భరోసా ఇవ్వలేదని, భేషరతుగా బీఆర్ఎస్ను విలీనం చేయాలని పట్టుబట్టారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయలేదని వివరించారు.
గద్దర్ పాటలకు అభిమాని కేసీఆర్
బీఆర్ఎస్ పరిపాలనలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాయని, పొరపాట్లను సరిదిద్దుకొంటూ ముందుకు సాగుతామని కేటీఆర్ తెలిపారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఉన్నంతలో నేర్చుకుంటూ, మంచి చేస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల్లో చివరి వరకు తెగించి కొట్లాడాలని అన్నారు. ప్రగతిభవన్ గేటు వద్ద 3 గంటలు వేచిచూసినా గద్దర్‌ను సీఎం కేసీఆర్ కలవలేదన్నది అసత్యమని కేటీఆర్ కొట్టిపడేశారు. గద్దర్ పాటలకు కేసీఆర్ అభిమాని అని వివరించారు. ఆయన చనిపోయాక అంత్యక్రియలను సీఎం కేసీఆర్ అధికారికంగా నిర్వహించారని పేర్కొన్నారు.
కేసీఆర్‌ను మించిన ప్రజాస్వామ్యవాది లేరు
సీఎం కేసీఆర్‌ను మించిన ప్రజాస్వామ్యవాది లేరని మంత్రి కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో అనేక యూట్యూబ్ చానళ్లు, పత్రికలు నిత్యం కేసీఆర్‌ను తిడుతూ రాస్తున్నాయని, దుష్ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. అయినప్పటికీ అన్నింటినీ భరిస్తూ గంభీరంగానే ఉంటున్నారని, మరో రాష్ట్రంలో సీఎంలైతే జైళ్లలో వేస్తున్నారని వెల్లడించారు. ప్రధాని మోదీ, దేశంలో ఇతర ఏ సీఎంతో పోల్చినా కేసీఆర్‌ను మించిన ప్రజాస్వామ్యవాది లేరని వివరించారు. కోపమైనా, ప్రేమనైనా బాహాటంగానే ప్రకటిస్తారని తెలిపారు. 2009లో పీఆర్పీతో పొత్తుపెట్టుకోవాలని కేసీఆర్ నిర్ణయించారని, కానీ పార్టీ నేతలంతా చెప్తే తనకు నచ్చకపోయినా టీడీపీ ఏర్పాటు చేసిన మహాకూటమిలో చేరారని గుర్తుచేశారు.