హైదరాబాద్ : డ్రగ్ హబ్‌గా నిలుస్తున్న హైదరాబాద్‌కు బల్క్‌డ్రగ్ పార్క్ ఇవ్వకుండా.. ఒక్క ఫార్మా సంస్థ లేని ఉత్తరప్రదేశ్‌కు బల్క్ డ్రగ్క్ పార్క్ ఇచ్చారని.. సైన్స్‌లో మోదీకి నోబెల్ బహుమతి ఇస్తే బాగుంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా.. రాష్ట్ర ప్రగతినికి సంబంధించి గూగుల్ మ్యాప్‌ల సాయంతో వివరించడంతో పాటు కొత్తగా ఏర్పాటైన పరిశ్రమలకు సంబంధించిన చిత్రాలను సైతం అసెంబ్లీలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఐటీరంగంలో బెంగళూరుకు హైదరాబాద్ గట్టి పోటీ ఇస్తుందన్నారు.
2014లో హైదరాబాద్‌లో 3.23 లక్షల ఐటీ ఉద్యోగులు ఉంటే.. ప్రస్తుతం ఆ సంఖ్య 8.70 లక్షలకు చేరిందని ప్రకటించారు. గతేడాది దేశంలో ఐటీలో 4.50 లక్షల ఉద్యోగాలు వచ్చాయని, 4.50 లక్షల ఉద్యోగాల్లో తెలంగాణ వాటా లక్షన్నర ఉద్యోగాలన్నారు. ఐటీలో కొత్త ఉద్యోగాల్లో హైదరాబాద్ బెంగళూరును దాటిందని, సుల్తాన్‌పూర్‌లో ఆసియాలోనే అతి పెద్ద స్టంట్ పరిశ్రమ నెలకొన్నదని కేటీఆర్ ప్రకటించారు. తాము స్టార్టప్ అంటే.. బీజేపీ ప్యాకప్ అంటోందని సెటైర్లు వేశారు. కేంద్రం రూ.12 లక్షల కోట్ల కార్పోరేట్ల రుణాలు మాఫీ చేసిందన్న కేటీఆర్.. ప్రభుత్వసంస్థల అమ్మకంతో బీసీ, ఎస్సీ, ఎస్టీల ఉద్యోగాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్ మహమ్మారి తర్వాత కేంద్రం రూ.20లక్షల కోట్ల ప్యాకేజ్ ఇస్తామని ప్రకటించిందని, ఆ ప్యాకేజీపై శ్వేతపత్రం ఇచ్చే దమ్ముందా? అని కేటీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు.
ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి కేంద్రం సామాన్యుల పొట్టకొడుతుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్తులను ఇద్దరు అమ్ముతుంటే.. ఇద్దరు కొంటున్నారని ఆరోపించారు. ముద్రా రుణాలు ఇచ్చామని, అద్భుతాలు చేశామని అంటున్నారని, పేదలు, రైతులకు రూపాయి గ్రాంట్ ఇవ్వరన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ చాలా హామీలు ఇచ్చిందని గుర్తు చేసిన కేటీఆర్.. వరదల సమయంలో హైదరాబాద్‌కు రూపాయి ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్లో వరదలు వస్తే మాత్రం రూ.1000 కోట్లు ఇచ్చి వచ్చారని, మోదీ దేశానికి ప్రధానా..? గుజరాత్‌కు ప్రధానా? అని ప్రశ్నించారు. ఉపన్యాసాలతో అవార్డులు రావన్న కేటీఆర్.. కష్టపడితేనే అవార్డులు వస్తాయన్నారు.