KTR | హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో రెండు పార్టీల మధ్య యుద్ధం జరుగుతోంది.. ఆ రాష్ట్ర పంచాయతీలకు తెలంగాణను వేదిక కానివ్వం అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా చంద్రబాబు అరెస్టుపై విలేకరులు ప్రశ్నించగా ఈ విధంగా వివరణ ఇచ్చారు.
చంద్రబాబు అరెస్టు ఏపీకి చెందిన రాజకీయ సమస్య. చంద్రబాబు అరెస్టుతో తెలంగాణకు సంబంధం లేదు. చంద్రబాబును అరెస్టు చేస్తే హైదరాబాద్‌లో ఆందోళనలు ఏంటి..? చంద్రబాబు అరెస్టుపై విజయవాడ, రాజమండి, అమరావతిలో ఆందోళనలు చేసుకోవాలి. ఆంధ్రాలో పంచాయితీ.. ఆంధ్రాలో తేల్చుకోవాలి అని కేటీఆర్ సూచించారు.
హైదరాబాద్‌లో ఆందోళనలకు అనుమతిపై లోకేశ్ ఓ మిత్రుడి ద్వారా తనకు ఫోన్ చేయించి అడిగారని కేటీఆర్ తెలిపారు. ఒకరికి అనుమతిస్తే వేరే పార్టీకి అనుమతి ఇవ్వాల్సి వస్తుందని చెప్పాను. పోటాపోటీ ఆందోళనలు జరిగితే శాంతి భద్రతల పరిస్థితి ఏంటి..? వేల మంది ఆంధ్రా సోదరులు తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నారు. హైదరాబాద్‌లో ఐటీ దెబ్బ తినకూడదని మేం ప్రయత్నిస్తున్నాం. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఐటీ సెక్టార్లో ఆందోళనలు జరగలేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ వాసులను టీడీపీ, వైసీపీ ఇబ్బంది పెట్టడం సరికాదని కేటీఆర్ అన్నారు. వైసీపీ, టీడీపీకి తెలంగాణలో ప్రాతినిధ్యం లేదు. తెలంగాణలో అన్ని ప్రాంతాల వారు కలిసిమెలిసి ఉంటున్నారు. మా పార్టీ నేతలు స్పందిస్తే అది వారి వ్యక్తిగత అభిప్రాయం. మేం తటస్థంగా ఉంటున్నాం. నేను, లోకేశ్, జగన్, పవన్‌కు మిత్రుడిని అని కేటీఆర్ తెలిపారు.