హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ):‘బావా.. చిన్న రిక్వెస్ట్. గట్టుప్పల్‌కు చెందిన యశోద (దివ్యాంగురాలు) గతంలో కామినేని దవాఖానలో జీఎన్ఎంగా పనిచేసింది. ప్రస్తుతం చదువుకొంటూనే ప్రైవేట్ దవాఖానలో పనిచేస్తున్నది. చండూరు పీహెచ్సీలో జీఎన్ఎం పోస్టు ఖాళీ ఉందంటా నా దగ్గరికి వచ్చింది. ఆ వివరాలు వాట్సాప్ చేస్తా. కొద్దిగా పరిశీలించండి’ అంటూ మంత్రి హరీశ్‌రావుకు మంత్రి కేటీఆర్ ఫోన్‌చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో జరిగిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. సమ్మేళనం ముగిసిన తర్వాత మునుగోడు నియోజకవర్గం గట్టుప్పల్‌కు చెందిన యశోద(27) తన తండ్రితో కలిసి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. తన కుటుంబ పరిస్థితిని వివరించారు. తనకు సహాయం చేయవల్సిందిగా అభ్యర్థించారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ ..యశోద కుటుంబ వివరాలను అడిగి తెలుసుకొన్నారు. తల్లిదండ్రులు ఏమి చేస్తారు. నీకు ఏమి కావాలి? గట్టుప్పల్‌లో జీఎన్ఎం పోస్టు ఖాళీగా ఉన్నదా? చండూరు వెళ్లి చేస్తావా? పింఛన్ వస్తున్నదా? అని అడిగి తెలుసుకొన్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావుకు ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేశారు.