– సమీకృత వ్యవసాయంతో అధిక లాభాలు
– జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు
– కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ భరత్
రుద్రంపూర్, ఫిబ్రవరి 14 : కొత్తగూడెం రేడియో స్టేషన్లో శనివారం ‘రేడియో కిసాన్ దివస్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత రేడియో కేంద్రం ప్రాంగణంలో పలు ఔషధ, పూల మొక్కలతో ఏర్పాటు చేసిన “ప్రకృతి మాత గ్రీన్ గార్డెన్” ను స్టేషన్ ప్రోగ్రామ్ హెడ్ కొలిపాక శంకరరావు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి.బాబురావు, కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ టి.భరత్, జిల్లా మత్స్యశాఖ అధికారి ఇంతియాజ్ అహ్మద్, రామవరం పశు వైద్యులు డాక్టర్ జి.ఆనందరావు, పలువురు ఆదర్శ, అభ్యుదయ రైతులు పాల్గొని మాట్లాడారు.
రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే సమీకృత వ్యవసాయం ద్వారా సాధ్యమవుతుందన్నారు. పంటలతో పాటుగా చేపలు, కోళ్లు, మేకలు, ఇతర పంటలతో వ్యవసాయం చేస్తే రైతుకు ఎంతో లాభామన్నారు. రైతులను చైతన్యవంతులు చేసేందుకు రేడియో ద్వారా ప్రసారం చేస్తున్న వ్యవసాయ కార్యక్రమాలు రైతులకు ఎంతో ఉపయోగ పడుతున్నాయన్నారు. అనేక సంవత్సరాలుగా రేడియో ద్వారా రైతులకు అందిస్తున్న వ్యవసాయ కార్యక్రమాల ద్వారా రైతుల్లో ఆసక్తిని, చైతన్యాన్ని కలిగిస్తున్న ఆకాశవాణికి అభినందనలు తెలిపారు. భవిష్యత్లో మరిన్ని రైతు ఉపయోగ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
రేడియో కార్యక్రమాల వల్ల వ్యవసాయంలో వస్తున్న మార్పులు, సాంకేతిక పద్ధతులను వివరించడం ద్వారా పంటల సరళిలో మార్పు వచ్చిందని, అధిక దిగుబడులు సాధ్యమవుతున్నాయని పలువురు ఆదర్శ రైతులు ఈ సందర్భంగా తెలిపారు. కిసాన్ దివస్ ను పురస్కరించుకుని పలువురు అభ్యుదయ రైతులను, అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ రైతు గొట్టిపాటి వెంకటేశ్వర్లు, నర్సిరెడ్డి, క్రీస్తు రాజు, సందీప్, హనుమా, మొక్కల పెంపకందారులు నూర్వి రాజశేఖర్, రామంచి శ్రీనివాస్, రేడియో స్టేషన్ ఇంజనీరింగ్ సిబ్బంది బాబు సింగ్, సుమన్, ఆనంద్, కోటేశ్వరరావు, రేడియో జాకీలు పాల్గొన్నారు.

ఆకాశవాణిలో ఘనంగా “రేడియో కిసాన్ దివస్”