కుభీర్ : ఫర్టిలైజర్ దుకాణాల డీలర్లు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులను విక్రయించాలని అధిక ధరలకు అమ్మితే డీలర్ లైసెన్స్ ( Dealer Licence ) రద్దు చేస్తామని మండల వ్యవసాయ అధికారిణి సారిక రావు ( Sarika Rao ) హెచ్చరించారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని శ్రీరామ ట్రేడర్స్ ఫర్టిలైజర్ దుకాణాన్ని శనివారం ఆమె సందర్శించారు.
నాలుగు రోజుల క్రితమే ఈ దుకాణ లైసెన్స్ రద్దుకు జిల్లా ఉన్నతాధి కారులకు సిఫారసు చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ దుకాణాన్ని తెరిచి ఉంచుతూ రూ. 266 రూపాయల యూరియా బస్తా రూ.360 నుండి రూ. 370 వరకు విక్రయిస్తున్నారని రైతులు ఫిర్యాదు చేయడంపై ఆమె మండిపడ్డారు. తాము ఎరువులను విక్రయించడం లేదని, రైతులు బుక్ చేసుకున్న యూరియా బస్తాలను ఇవ్వడం కోసమే దుకాణం తెరిచి ఉంచినట్లు డీలర్ తెలిపారు.
ఈ సందర్భంగా వెంటనే దుకాణాన్ని వ్యవసాయ అధికారిని సారిక రావు మూసి వేయించారు. అనంతరం బస్టాండ్ సమీపంలోని రెండు ఫర్టిలైజర్ షాపులను ఆమె తనిఖీ చేసి అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని డీలర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఏవో సారిక రావు తో మాట్లాడుతూ ఫర్టిలైజర్ యాప్ వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అన్నారు. కొద్దిరోజుల్లో సమస్య తీరిపోతుందని అధిక ధరలకు యూరియాను విక్రయిస్తే తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు.