Eggs Van | పాపన్నపేట, ఆగస్టు 3: గుడ్ల లోడుతో వెళ్తున్న బొలెరో వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటన పాపన్నపేట శివారులో చోటుచేసుకుంది. వ్యాన్ డ్రైవర్ పాపన్నపేట శివారులో బారాఖనల్ వద్ద రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయే క్రమంలో గుడ్లవ్యాన్ ఫల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయాన్నిగమనించిన స్థానికులు వెంటనే డ్రైవర్‌ను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో వాహనంలో ఉన్న వేలాది గుడ్లు పగిలిపోయి నేలపాలయ్యాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ నుంచి పాపన్నపేట వైపు గుడ్ల లోడుతో వస్తున్న బొలెరో వ్యాన్ పాపన్నపేట శివారులోని భారఖనల్ వద్ద గుంతను తప్పించబోయి రోడ్డుపక్కకు దూసుకెళ్లి పల్టీలు కొట్టి బోల్తా పడింది. దీంతో వ్యాన్ ముందు భాగం దెబ్బతినగా, అందులో ఉన్న గుడ్ల ట్రేలు చెల్లాచెదురై పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఈ ఘటనతో రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రహదారికి మరమ్మతులు చేపట్టి గుంతలను పూడ్చివేయాలని స్థానికులు కోరుతున్నారు.
