న్యూఢిల్లీ: అసెంబ్లీ ఉప ఎన్నికల్లో(Assembly Bypolls) గుజరాత్‌లోని మంజల్‌పుర్ నియోజకవర్గాన్ని బీజేపీ కైవసం చేసుకున్నది. వడోదర జిల్లాలో ఉన్న ఆ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి సతీశ్ పటేల్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి బికాబాయి రాబరిపై సుమారు 30 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎన్నికల సంఘం డేటా ప్రకారం.. సతీశ్ పటేల్‌కు 55481 ఓట్లు పోలయ్యాయి. ఇక రాబరికి 24,851 ఓట్లు పడ్డాయి. 20 రౌండ్ల కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు పటేల్‌కు 30,630 ఓట్ల మెజారిటీ దక్కింది. జూలై 30వ తేదీన ఉప ఎన్నిక జరిగింది. సీనియర్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి యోగేశ్ పటేల్ జూన్ 2వ తేదీన మృతిచెందడంతో ఆ సీటుకు ఉప ఎన్నిక నిర్వహించారు. మంజల్‌పుర్ ఎన్నికలో కేవలం రెండు పార్టీలు మాత్రం ముఖాముఖిగా పోటీపడ్డాయి. కాంగ్రెస్, బీజేపీ మాత్రమే పోటీలో నిలిచాయి. ఈ సీటు గెలుపుతో గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ సంఖ్య 162కు పెరిగింది. ఆ రాష్ట్రంలో మొత్తం 182 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్‌కు 12, ఆమ్ ఆద్మీకి 5 సీట్లు ఉన్నాయి.
ఇక మధ్యప్రదేశ్‌లోని దాతియా నియోజకవర్గం కోసం జరిగిన ఉప ఎన్నిక హోరాహోరీగా సాగింది. ఆ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఘన్‌శ్యామ్ సింగ్ విజయం సాధించారు. ఆయనకు 66757 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఆశుతోష్ తివారిపై ఘన్‌శ్యామ్ గెలిచారు. సుమారు 6016 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం డేటా ద్వారా తెలుస్తోంది. ఆజాద్ సమాజ్‌పార్టీకి చెందిన దామోదర్ యాదవ్‌కు సుమారు 22 వేల ఓట్లు పోలయ్యాయి.