Gellu Srinivas Yadav | నిబంధనలకు అనుగుణంగా మౌలిక వసతులు లేనప్పటికీ నోవా మెడికల్ కాలేజీకి ఇచ్చిన గుర్తింపును రద్దు చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ), రాష్ట్ర వైద్యశాఖ, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారుల తీరుపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు, మీడియా ప్రతినిధులు నోవా మెడికల్ కాలేజీని సందర్శించారు. కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్న సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని వారిని అదుపులోకి తీసుకుని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం అవసరమైన వసతులు లేకున్నా కాలేజీకి గుర్తింపు ఎలా ఇచ్చారో రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని గెల్లు శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. కాలేజీలో 21 విభాగాలు ఉన్నట్లు చెబుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా సిబ్బంది లేరని ఆరోపించారు. నాణ్యమైన ప్రొఫెసర్లు, రీడర్లు, ట్యూటర్లు అందుబాటులో లేరని పేర్కొన్నారు. 250 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు సరిపడా తరగతి గదులు కూడా లేవని ఆరోపించారు. 1985 నుంచి కొనసాగుతున్న పలు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు కూడా ఇప్పటివరకు 250 యూజీ ఎంబీబీఎస్ సీట్లు కేటాయించలేదని, అలాంటిది 2024లో ఏర్పాటైన నోవా మెడికల్ కాలేజీకి ఇన్ని సీట్లు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. డెక్కన్, అపోలో, కామినేని వంటి ప్రైవేటు మెడికల్ కాలేజీలకు కూడా 250 సీట్లు కేటాయించలేదని, రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు సైతం ఇంత పెద్ద సంఖ్యలో సీట్లు ఇవ్వలేదని అన్నారు.
నోవా మెడికల్ కాలేజీ తనిఖీ సమయంలో తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులను గుర్తించి ఉద్యోగాల నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గెల్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్ల పెంపునకు సిఫారసు చేయని అధికారులు, నిబంధనలను పాటించని ప్రైవేటు కాలేజీకి 250 సీట్లు ఎలా కేటాయించారో సమాధానం చెప్పాలని కోరారు. ల్యాబొరేటరీ సదుపాయాలు లేకపోతే వైద్య విద్యార్థులకు ప్రాక్టికల్ పరిజ్ఞానం ఎలా వస్తుందని ప్రశ్నించారు. ప్రతి 8 మంది విద్యార్థులకు ఒక మృతదేహం ఉండాల్సిన నిబంధన ఉందని, నోవా మెడికల్ కాలేజీలో అందుకు అనుగుణంగా మృతదేహాలు అందుబాటులో ఉన్నాయా అనే విషయాన్ని అధికారులు పరిశీలించాలని అన్నారు. విద్యార్థులకు కాలేజీ ప్రాంగణంలోనే తగిన హాస్టల్ వసతి ఉండాల్సి ఉన్నప్పటికీ అవసరమైన స్థాయిలో వసతి లేదని ఆరోపించారు. అయినప్పటికీ ఉన్నట్లుగా అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చి సీట్ల కేటాయింపునకు మార్గం సుగమం చేశారని విమర్శించారు.
నిబంధనల ప్రకారం కనీసం 1500 పడకల ఆస్పత్రి, తగిన ఓపీ సదుపాయాలు ఉండాల్సి ఉండగా అవి లేకుండానే కాలేజీకి అనుమతులు ఎలా ఇచ్చారని గెల్లు ప్రశ్నించారు. మెడికల్ కాలేజీ, ఆస్పత్రి మధ్య నుంచి హైటెన్షన్ విద్యుత్ కేబుళ్లు వెళ్తున్నాయని, వాటివల్ల విద్యార్థులు, సిబ్బందికి ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్ల పెంపునకు సిఫారసు చేయని అధికారులు, ప్రైవేటు కాలేజీలో సీట్లను పెంచడం వెనుక అవినీతి జరిగిందనే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. నోవా మెడికల్ కాలేజీకి సీట్ల కేటాయింపు, గుర్తింపు వ్యవహారంపై ఎన్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
నిబంధనల ఉల్లంఘనలు, అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు నోవా మెడికల్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని గెల్లు శ్రీనివాస్‌యాదవ్ కోరారు.