హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్‌పై రూపొందిన కొత్త పాటలు జనం హృదయాలను కదిలిస్తున్నాయి. ‘గులాబీల జెండలే రామక్క’ పేరుతో ఇటీవలే వచ్చిన కొమ్ము లక్ష్మమ్మ పాట ఇప్పటికే ప్రజల నోళ్లలో నానుతున్నది. ఈ పాటను ఎన్నికల సభల్లో కళాకారులు పాడుతుంటే సభకు వచ్చిన జనం స్వరం కలుపుతూ సందడి చేస్తున్నారు. తాజాగా కేసీఆర్‌పై విడుదలైన మరో పాట ప్రజల్లో ఆలోచనను రగిలిస్తున్నది. ‘ఉక్కు గుండెనొక్కసారన్నా తాకాలని ఉన్నదే.. ఆ బక్కపల్చని పెయ్యిని హత్తుకోవాలని ఉన్నదే’ అని కళాకారుడు మాట్ల తిరుపతి రాసిన ‘మన బాపు కేసీఆర్’ పాట ఆడియో విజువల్ సీడీని బుధవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్ ఆవిషరించారు. ఉద్యమ రథసారథి కేసీఆర్ త్యాగాలను ఈ పాట గుర్తు చేస్తున్నదని కేటీఆర్ కొనియాడారు.
స్వయం పాలనలో సీఎంగా కేసీఆర్ ఔన్నత్యాన్ని చాటుతుందని తెలిపారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల గుండెల్లో కొలువై ఉన్నాడన్న భావనను పాట లో తిరుపతి వ్యక్తీకరించారని పేర్కొన్నారు. ఈ పాట సమర్పకుడైన ఎంపీ సంతోష్‌కుమార్‌ను, నిర్మాత ఎస్ రాఘవ, డైరెక్టర్ పూర్ణను కేటీఆర్ అభినందించారు. ‘మన బాపు కేసీఆర్’ పాట అద్భుతంగా ఉన్నదని మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ కొనియాడారు. రచయిత తిరుపతికి అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ రాసిన ఈ పాట చాలా ఉత్తేజం నింపుతుందని ఎంపీ సంతోష్‌కుమార్ కొనియాడారు. ఈ సాంగ్ వింటే గూస్బంప్స్ తప్పవని, ఇది కేవలం మ్యూజిక్ మాత్రమే కాదని, ఇది వారసత్వ జర్నీ అని పేర్కొంటూ తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు.