కరీంనగర్, మార్చి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన సొంత నియోజకవర్గం అభివృద్ధిపై మళ్లీ పాత పాటే అందుకొన్నారు. ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ఇటీవల సంధించిన ఒక్క ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పకుండా అడ్డదిడ్డంగా మాట్లాడారు. శుక్రవారం కరీంనగర్లో హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వేసిన ప్రశ్నల గురించి మీడియా బండిని ప్రశ్నించగా ఒక్క అంశంపై కూడా సూటిగా మాట్లాడలేదు. కరీంనగర్ నియోజకవర్గానికి కేంద్రం నుంచి ఒక్క గుడి అయినా తెచ్చారా? అన్న కేటీఆర్ ప్రశ్నకు.. వేములవాడ రాజన్న ఆలయానికి ‘ప్రసాదం’ స్కీం కింద ప్రతిపాదనలు పంపితే కేంద్రం నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నదని దాటవేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఒక్కటైనా చెప్పుకోదగిన పని సాధించారా? అన్న ప్రశ్నకు జాతీయ రహదారి నిర్మాణానికి సీఆర్ఐఎఫ్ కింద రూ.205 కోట్లు తెచ్చానని, ప్రధానమంత్రి సడక్ యోజన, ఈజీఎస్ కింద వేల కోట్లు తెస్తున్నామని తెలిపారు. నిజానికి ప్రధానమంత్రి సడక్ యోజన, ఈజీఎస్ కరీంనగర్‌కు మాత్రమే కాకుండా దేశమంతా అమలవుతున్నాయి. అవి చట్ట ప్రకారం రావాల్సినవే. ఆయన ఒక్కరే ప్రత్యేకంగా తెచ్చినట్టు చెప్పడం గమనార్హం. గంగులపై పోటీ చేసి గెలుస్తారా? అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పకుండా తమ పార్టీ నాయకత్వం నిర్దేశించినట్టు చేస్తానని చెప్పి తప్పించుకొన్నారు.