హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టిందని, అన్ని రకాలుగా రాష్ట్రంపై వివక్ష ప్రదర్శిస్తున్నదని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖమంత్రి కే తారకరామరావు మండిపడ్డారు. కేంద్రం సహకరించకపోయినా సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని తెలిపారు. సింగరేణిని సిక్ యూనిట్‌గా మార్చి ప్రైవేట్‌పరం చేయాలని కేంద్రం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని తేల్చి చెప్పారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై ఆయన సావధానంగా సమాధానాలిచ్చారు.
సింగరేణి అంశంపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ.. కేంద్రం కుట్రలను ఎండగట్టారు. సింగరేణిలో 4 బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించకుండా ఆ సంస్థకే వాటిని అప్పగించాలని ప్రధానికి సీఎం కేసీఆర్ అనేక ఉత్తరాలు రాసినా స్పందించలేదని విమర్శించారు. అదే గుజరాత్లో మాత్రం ఆ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్కు కేటాయించారని తెలిపారు. గుజరాత్‌కు ఒకనీతి.. తెలంగాణకు ఒకరీతిగా మోదీ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లాభాల్లో నడిచే సింగరేణిని సిక్ యూనిట్‌గా మార్చి ఆ తరువాత తమ మిత్రులకు సింగరేణిని కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం కుట్రలను ప్రజాబాహుళ్యంలో ఎండగడతామని తెలిపారు. ఉద్యమం నుంచి వచ్చిన తమకు మరో పోరాటం చేయటం కష్టమేమీ కాదని స్పష్టంచేశారు. సింగరేణిపై బీజేపీ కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించారు. సింగరేణి కార్మికులు, ఇతర అన్ని వర్గాలతో కలిసి ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాల్సిందే
రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటుచేసేలా అన్ని స్థాయిల్లో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. బయ్యారం విషయంలో కేంద్రం సవతితల్లి ప్రేమ ప్రదర్శిస్తున్నదని మండిపడ్డారు. బయ్యారంలోని ఐరన్ ఓర్ (ముడి ఇనుము)లో నాణ్యతలేదని నిస్సిగ్గుగా ప్రచారం చేస్తూ కేంద్రం తప్పుదారి పట్టిస్తున్నదని నిప్పులు చెరిగారు.
బయ్యారంలో కేంద్ర ప్రభుత్వం సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ప్లాంటు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నదని వివరించారు. ఇటీవల తన దావోస్ పర్యటనలో (వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు) భాగంగా జిందాల్ సంస్థ ప్రతినిధులతో, మిట్టల్ (లక్ష్మి స్టీల్స్)తోనూ బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో చర్చించామని తెలిపారు. అలాగే సింగరేణి సంస్థ ఆధ్వర్యంలోనైనా సరే బయ్యారం ఉక్కుపరిశ్రమ స్థాపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్ ప్రగతికి మోకాలడ్డు
హైదరాబాద్ నగర కనెక్టివిటీని మెరుగుపరుస్తుంటే కేంద్రం మోకాలడ్డుతున్నదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఎనిమిదిన్నరేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాభివృద్ధి విషయంలో సహకరిచాలని కేంద్రానికి అనేక ఉత్తరాలు రాసినా స్పందన లేదని మండిపడ్డారు. రక్షణశాఖ భూముల విషయంలో అరుణ్‌జైట్లీ దగ్గరి నుంచి మొదలుకొంటే ప్రస్తుత రక్షణశాఖ మంత్రిదాకా అందరికీ ఉత్తరాలు రాసినా సమస్య పరిష్కారానికి సహకరించటం లేదని విమర్శించారు. ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి వేసిన ఇతర ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ బదులిచ్చారు.
రక్షణశాఖ భూములపై సాంకేతిక కారణాలు చూపి రాష్ట్ర ప్రభుత్వం సైతం కేంద్రంతో పంచాయితీ పెట్టుకోవచ్చు కానీ తమ ఉద్దేశం అదికాదని తెలిపారు. రక్షణశాఖ అంటే తమకూ గౌరవం ఉన్నదని స్పష్టంచేశారు. నాగ్‌పూర్ హైవే లింక్, ప్యాట్నీ నుంచి సుచిత్ర దాకా ప్రగతినగర్ టు బాచుపల్లి, జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి శామీర్‌పేట, మల్లంపేట ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఇలా అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ విషయంలో రక్షణశాఖ కొర్రీలు పెడుతున్నదని అసహనం వ్యక్తంచేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అలాగే రూ.8,052 కోట్లతో మొదటి దశ ఎస్ఆర్డీపీలో భాగంగా చేపట్టిన 48 పనుల్లో 11 మినహా అన్నీ పూర్తయ్యాయని మంత్రి వివరించారు. త్వరలో రూ.4,305 కోట్లతో రెండోదశ పనులను చేపడుతామని తెలిపారు.
ఏ దేవుడు దుమ్ము.. ధూళిలో ఉండాలని కోరుకోడు
ఏ దేవుడూ తాను దుమ్ము..ధూళిలో ఉండాలని కోరుకోడని మంత్రి కేటీఆర్ అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని అధిగమించేందుకు రోడ్లపై ఉన్న ప్రార్థనా స్థలాల విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొంటుందని చెప్పారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో రోడ్లపై ఉన్న ప్రార్థనాస్థలాల విషయంలో తీసుకొన్నట్టుగానే ఇక్కడా నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సూచించారు. దీనిపై మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ మంచిని ఎక్కడి నుంచైనా స్వీకరిస్తామని చెప్పారు. రోడ్లపై ఉన్న ప్రార్థనా స్థలాల విషయంలో ఎక్కడెక్కడ ఏం చేశారు అనే విషయాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. గుజరాత్లో చేసినట్టుగా చట్టం తేవాలా? లేదా ఇంకేదైనా చేయాలా? అనేది ఆలోచిస్తామని, ఆయా ప్రార్థనా స్థలాలకు గౌరవం ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారు.
కాంగ్రెస్‌కు అబద్ధాలు ఫ్యాషన్
దుద్దిళ్ల, రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఫైర్
రాష్ట్రప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు ఆధార రహితంగా ఆరోపణలు చేస్తున్నారని ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. నిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పు చేశామని తెలిసి కూడా క్షమాపణ చెప్పేందుకు భేషజాలకు పోతున్నారని విమర్శించారు. ఫార్మాసిటీ భూములపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసెంబ్లీలో చేసిన అసత్య ఆరోపణలతోపాటు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రగతిభవన్‌ను కూల్చేస్తామన్న వ్యాఖ్యలపై కేటీఆర్ గురువారం అసెంబ్లీలో తీవ్రంగా స్పందించారు.
ఫార్మా సిటీలో భూములను రూ.8 లక్షలకు కొని, రూ.1.30 కోట్లకు అమ్ముతున్నారని శ్రీధర్‌బాబు ఆరోపించారు. దీనిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫార్మాసిటీలో ఒక్క ఎకరం కాదు ఒక్కసెంటు భూమి కూడా ఎవరికీ కేటాయించలేదని స్పష్టం చేశారు. భూములు ఎక్కడ ఎవరికి కేటాయించారో శ్రీధర్‌బాబు చెప్పాలని డిమాండ్ చేశారు. సభను తప్పుదారి పట్టించిన శ్రీధర్‌బాబు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని అన్నారు. దీంతో స్పీకర్ కల్పించుకొని శ్రీధర్‌బాబు వైఖరి చెప్పాలని ఆదేశించారు.
‘ఐ స్టాండ్ కరెక్టెడ్ ఇఫ్ నాట్ రైట్’ అని శ్రీధర్‌బాబు బదులివ్వటంతో కేటీఆర్ మండిపడ్డారు. తప్పుచేసిన శ్రీధర్‌బాబు ఆంగ్లభాషలో అందంగా చెప్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. చివరికి శ్రీధర్‌బాబు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. రేవంత్‌రెడ్డి ప్రగతిభవన్‌ను గ్రెనేడ్లతో పేల్చేయాలని చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో భూములపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి వద్ద ఒక దఫ్తర్ నడుస్తున్నది. ఓ ప్రత్యేక కార్యాలయంలో రిటైర్డ్ తహసీల్దార్లతో సహా కొంతమందిని కూర్చోబెట్టుకొని ప్రభుత్వాన్ని, ప్రైవేటు వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయాలు వసూలు చేసేవారికి ధరణి వల్ల ఇబ్బంది ఉంటుంది’ అని కేటీఆర్ విమర్శించారు.