హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) /చిక్కడపల్లి/ మారేడ్‌పల్లి/ బొల్లారం: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జ్ఞాని సాయన్న సేవలు మరువలేనివని ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది పలు పదవులు ద్వారా సాయన్న అందించిన ప్రజాసేవ చిరస్మరణీయమని తెలిపారు. సోమవారం ఉదయం సికింద్రాబాద్ కార్ఖనాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని సాయన్న భౌతికకాయానికి నివాళులర్పించారు. సాయన్న కుటుంబీకులను పరామర్శించి ధైర్యం చెప్పారు. సాయన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ నెల 16న నడవలేక ఆయాసంతో బాధపడుతు న్న ఆయనను కుటుంబసభ్యులు సికింద్రాబాద్‌లోని యశోద దవాఖానలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయనకు తీవ్ర గుండెపోటు రా వడంతో ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు.
పార్థివదేహానికి ప్రముఖుల నివాళి
సాయన్న నివాసం వద్దకు సోమవారం మంత్రు లు, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. సాయన్న భౌతికకాయాన్ని సందర్శించి పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఉప సభాపతి టీ పద్మారావుగౌడ్, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, సబితారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, కేంద్రమం త్రి జీ కిషన్‌రెడ్డి తదితరులు సాయన్న పార్థివదేహానికి పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల అశ్రునయనాల మధ్య ఎమ్మెల్యే సాయన్న అంతిమయాత్ర మధ్యాహ్నం 3.25 గంటలకు కార్ఖాన గృహలక్ష్మికాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభమైంది. రాత్రి 7 గంటలకు ఈస్ట్ మారేడుపల్లిలోని హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు ముగిశాయి. ఎమ్మెల్యే అల్లుడు సూర్యచంద్ర (పెద్ద కుమార్తె భర్త) తలకొరివి పెట్టారు.