WE HUB | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోమహిళా వ్యాపారులకు సింగిల్ విండో విధానం అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) స్పష్టం చేశారు. హోటల్ తాజ్ కృష్ణా( Taj Krishna ) వేదికగా వీ హబ్( WE HUB ) 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
వీ హబ్ ప్రతినిధులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. రూ. 1.30 కోట్లు ఇస్తే వీ హబ్ నుంచి ఒక స్టార్టప్‌తో రూ. 70 కోట్లకు పెంచారు. స్త్రీ నిధి కింద మహిళలకు రుణాలు అందిస్తున్నామని తెలిపారు. రూ. 750 కోట్లు వడ్డీ లేని రుణాలు విడుదల చేస్తున్నామని చెప్పారు. యువత ఎందుకు వ్యాపారవేత్తలు అవ్వకూడదు..? అని ప్రశ్నించారు. ప్రతీ పారిశ్రామిక పార్కులో 10 శాతం ప్లాట్స్ మహిళలకు కేటాయించామని తెలిపారు. ప్రతీ మూడు కోవిడ్ టీకాల్లో రెండు హైదరాబాద్ నుంచే వచ్చాయని కేటీఆర్ గుర్తు చేశారు.
స్త్రీ, పురుషులకు సమానంగానే ప్రతిభ ఉంటుంది అని కేటీఆర్ తెలిపారు. మానవ వనరులు, సాంకేతికతను వినియోగించుకుంటే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. అమ్మాయిలు వ్యాపార రంగంలో రాణించాలి. ప్రతి తల్లిదండ్రులు అమ్మాయిలకు ఇష్టమైన చదువును చదివించాలి. వారి ఫెయిల్యూర్ అయినా కూడా తల్లిదండ్రులు.. వెన్నుతట్టి ప్రోత్సహించాలి. అప్పుడే అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించగలుగుతారు అని కేటీఆర్ తెలిపారు.
ప్రస్తుతం చాలా మంది అనాగరికులుగా ఉన్నారని కేటీఆర్ అన్నారు. మన పిల్లలకు చిన్నప్పట్నుంచే విలువలు నేర్పించాలి. తల్లిదండ్రుల వ్యవహారశైలి పిల్లలపై ప్రభావం చూపుతుంది. మన పిల్లల్ని ఎలా పెంచుతామనేది ప్రధానం అని చెప్పారు. తల్లిదండ్రులు అమ్మాయిలు, అబ్బాయిల మధ్య వివక్ష చూపించరాదు. సమానంగా చూడటం మన ఇంటి నుంచే ప్రారంభిస్తే.. వారు కూడా ఇతర అమ్మాయిల్ని, అబ్బాయిల్ని సమానంగా, గౌరవంగా చూస్తారని కేటీఆర్ తెలిపారు.