హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): పార్టీ అధ్యక్షుడి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు అద్భుతమైన సమన్వయంతో ముందుకు సాగుతున్నాం కనుకే బీఆర్ఎస్ పార్టీ జైత్రయాత్రను కొనసాగిస్తున్నదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజలను గోల్మాల్ చేస్తూ గందరగోళానికి గురిచేసే కాంగ్రెస్ పార్టీ కుట్రలను క్షేత్రస్థాయిలో తిప్పికొట్టేది గులాబీ సైన్యమేనని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో జనగామ నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమావేశంలో మంత్రి కేటీఆర్ ముఖ్యఅథితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ‘అందరం ఒకే నాయకుని కింద, ఒకే జెండా కింద.. ఒకే ధ్యేయం కోసం పనిచేస్తున్నాం.
కేసీఆర్ తిరిగి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావాలె. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి హ్యాట్రిక్ సీఎం కావాలె’ అని ఆయన పిలుపునిచ్చారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్‌లాంటి మొదనష్టపు పార్టీ చేతిలో పొరపాటున కూడా పెట్టొద్దు’ అని చెప్పారు. రైతులను గోల్మాల్చేసి, ఆగం చేసి ఎట్లయినా పాగా వేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీని ఎట్టిపరిస్థితుల్లో నమ్మొద్దు..అన్నిరకాలుగా ఆదుకున్నది బీఆర్ఎస్ పార్టీయేనని రైతులకు, ప్రజలకు విడమరచి చెప్పాలని సూచించారు. ఈ నెల 16న జనగామలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభను దిగ్విజయం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. జనగామ గడ్డ మీద గులాబీ జెండా ఎగరాలని నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జనగామ జిల్లాలో 3 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు టీ రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు బోడకుంటి వెంకటేశ్వర్లు, నారదాసు లక్ష్మణరావు, జనగామ నియోజకవర్గం పరిధిలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.
ఈ నెల 16న జనగామలో నిర్వహించే బహిరంగసభ దద్దరిల్లాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ఉద్యమకాలం నుంచి జనగామ ప్రజలు సీఎం కేసీఆర్‌తో ఉన్నారని, ప్రజలు తమపై ఉంచిన అభిమానానికి గుర్తుగా సీఎం కేసీఆర్ జనగామను జిల్లా చేసి, మెడికల్ కాలేజీ ప్రారంభించిన చరిత్రను గుర్తుచేసుకోవాలని అన్నారు. కేసీఆర్‌కు జనగామ ప్రజలు బ్రహ్మరథం పడతారని ఈ సభతో నిరూపిస్తామని తెలిపారు. సీఎం జనగామ ప్రజలకు అపూర్వ అవకాశాలిచ్చారని, 16న ప్రతీ ఇంటికి ఒకరు చొప్పున కదిలి సభను విజయం చేయాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. అద్భుతమైన మ్యానిఫెస్టో ప్రకటించే మొదటి సభను రాష్ట్రం అబ్బురపడేలా విజయవంతం చేయాలని, అందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దాం అన్నారు.
జనగామ నియోజకవర్గం మొదటి నుంచి కేసీఆర్ వెంబడే ఉన్నది. పీసీసీ అధ్యక్షుడిని కూడా ఓడించిన చరిత్ర జనగామది. మంచి మనుషులున్నరు. కష్టపడి పనిచేసే కార్యకర్తలు, నాయకులున్నరు. 2014లో 34 వేలు ఓట్ల మెజారిటీని కేసీఆర్‌కు కానుకగా ఇచ్చిన్రు. 2018లో రెండోసారి 30 వేల మెజారిటీ ఇచ్చిన్రు. ఈసారి సర్వేలన్నీ 70 నుంచి లక్షల మెజారిటీ వస్తదని చెప్తున్నరు. పక్కాగా ఈసారి జనగామలో లక్ష మెజారిటీ ఖాయం. అందులో అనుమానం అక్కర్లేదు.
-ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి లైన్ క్లియర్ అయిందా? అంటే మంగళవారం జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ స్థానిక, ముఖ్యనాయకులు, కార్యకర్తల సమావేశం అవుననే స్పష్టమైన సంకేతం ఇచ్చింది. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అరమరికలు లేకుండా చెట్టాపట్టాలేసుకొని మెలిగారు. జనగామ ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించటం, అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో తమ నియోజకర్గం నుంచి పోటీచేసేది పల్లా రాజేశ్వర్‌రెడ్డి అని స్థానిక ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. అలాగే ముత్తిరెడ్డి సైతం కేసీఆర్ వెంటే జనగామ అని ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పల్లాకు జనగామ నుంచి పోటీచేసేందుకు లైన్ క్లియర్ అయిందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.