Minister KTR | సంపద పెంచడం ప్రజలకు పంచడం.. ఇదీ తెలంగాణ ప్రభుత్వ నినాదం. అందరికీ సంక్షేమ ఫలాలను అందించడమే కేసీఆర్ సర్కారు విధానం. పోడుపట్టాలు, రైతుబంధు, రుణమాఫీ, ఆర్టీసీ విలీనం, ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఎంబీసీలకు సాయం, మైనార్టీలకు చేయూత, దివ్యాంగుల పెన్షన్లు, గృహలక్ష్మి నెల రోజుల్లోనే కేసీఆర్ సర్కారు ప్రకటించిన వరాల్లో ఇవి కొన్ని మాత్రమే. రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగినంతకాలం సబ్బండ వర్ణాలపై వరాల జల్లు కురుస్తూనే ఉంటుంది.
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పాలనలో గత తొమ్మిదేండ్లుగా రాష్ట్రంలో సంక్షేమ స్వర్ణయుగం నడుస్తున్నదని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. సామాజికవర్గాల్లో శతాబ్దాలుగా గూడుకట్టుకున్న పేదరికాన్ని బద్దలు కొట్టాలన్న సంకల్పంతోనే ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, రాష్ట్రంలో అర్హులైన అందరికీ ప్రభుత్వ సాయం అందిస్తామని చెప్పారు. బీసీ కుల వృత్తులకు ఆర్థికసాయం కింద దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుస్తామని హామీ ఇచ్చారు.
గృహలక్ష్మి పథకం కింద ప్రతి నియోజకవర్గంలో మూడు వేల మందికి రూ.3 లక్షల చొప్పున ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. కులవృత్తులకు ఇచ్చే లక్ష రూపాయలు, ఇంటి నిర్మాణానికి ఇచ్చే రూ. 3 లక్షలను గ్రాంటు కింద ఇస్తున్నామని, వాటిని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. పేదరికం నిర్మూలన అయ్యే వరకు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంత వరకు సంక్షేమ పథకాలకు ఢోకా లేదని భరోసా ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం విస్తృతంగా పర్యటించిన మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ కులవృత్తుల వారికి చెక్కులు పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
నేతన్నలకు ఉపాధి కోసమే బతుకమ్మ ఆర్డర్లు
నేతన్నలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ను ఒప్పించి వారికి బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇప్పించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. చీరల తయారీలో జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ర్టాలకు చెందిన కార్మికులు ఉపాధి పొందుతున్నారని చెప్పారు. తంగళ్లపల్లిలోని ఓ సాంచాల కార్ఖానాకు తాను స్వయంగా వెళ్లి ఓ కార్మికుడిని వివరాలు అడిగితే.. జార్ఖండ్ నుంచి వచ్చి పనిచేస్తున్నట్టు హిందీలో చెప్పాడని తెలిపారు.
బీహార్ కూలీలు సైతం మన రాష్ర్టానికి వచ్చి పొలాల్లో వరినాట్లు వేస్తూ ఉపాధి పొందుతున్నారని అన్నారు. రైతులు, దళితులు సమాజంలోని అన్ని వర్గాలు ఆర్థికంగా ఎదగాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. మంచి చేసే మనసున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని కోరారు. బీడీ కార్మికులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్లు ఇచ్చి ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాలని చెప్పారు. పింఛన్ల కోసం ప్రతిపక్షాలు డిమాండ్ చేయలేదని, ప్రజలెవరూ అడగకుండానే పింఛన్లు పెంచిన ముఖ్యమంత్రి మళ్లీ పెంచుతారని భరోసా ఇచ్చారు.
సిరిసిల్ల మెడికల్ కళాశాలను వచ్చే నెలలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించి, పేదలకు అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా వైద్యసేవలందిస్తామని తెలిపారు. మహబూబాబాద్‌లోని దవాఖానలో 140 మంది వైద్యులతో అన్నిరకాల వైద్య సేవలందుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఆపద్బంధు పథకం ఉండేదని గుర్తు చేశారు. ఎవరైనా చనిపోతే ఇచ్చే రూ.50 వేలు ఏడాది గడిచినా వచ్చేవి కాదని విమర్శించారు.
ఈ రోజు ఏకారణం చేతనైనా రైతులు, నేతన్నలు చనిపోతే వారి కుటుంబానికి రైతు, నేత బీమా పథకాల ద్వారా రూ.5 లక్షలు నేరుగా బ్యాం కు ఖాతాలో వేసి సహాయం అందిస్తున్నామని చెప్పారు. నేతన్న బీమాలో 59 ఏళ్ల పైనున్న నేతన్నలకు డిపార్టుమెంటులో ప్రత్యేక ట్రస్టు పెట్టి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. వేములవాడలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతో కలిసి పర్యటించిన మంత్రి కేటీఆర్ నంది కమాన్ వద్ద వీటీడీఏ (వేములవాడ టెంపుల డెవలప్మెంట్ అథారిటీ) నిధులు రూ.14 లక్షలతో ఏర్పాటు చేసిన నందికమాన్ జంక్షన్, చింతలఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీలో 42 డబుల్ బెడ్రూం ఇండ్లు, ప్రభుత్వ దవాఖానలో మాతృసేవా సెంటర్‌ను ప్రారంభించారు. రూ.31 లక్షలతో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప్లాంట్, మహాలక్ష్మీ ఆలయం వద్ద మిషన్ భగీరథను ప్రారంభించారు.
మూలవాగు ఒడ్డున రూ.98 లక్షలతో నిర్మించిన బండ్ పార్క్‌ను ప్రారంభించారు. కార్యక్రమాల్లో కలెక్టర్ అనురాగ్ జయంతి, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, టీఎస్‌టీపీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి పాల్గొన్నారు.

Ktr
మందు పోయను.. పైసలు పంచను
‘ఓట్లు అనగానే చాలా మంది పిచ్చోళ్లు మోపతైరు. మందుపోస్తరు. పైసలు పంచుతరు. నేను నా జీవితంలో మందు పోయలేదు. పైసలు పంచలేదు. వచ్చే ఎన్నికల్లో కూడా మందుపోయ.. పైసలు పంచ.. మీ దయ ఉంటే గెలుస్తా.. లేకుంటే ఇంట్లో కూసుంట.. తప్పితే ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం నా వల్ల కాదు’ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ‘నాలుగు ఎలక్షన్లలో నాలుగుసార్లు గెలిపించారు. గెలిపించినందుకు మంచిగ సేవ చేస్తా, పని చేస్తా. బీద బిక్కి కడుపులో పెట్టుకుని కుల, మతం పిచ్చి లేకుండా అన్ని వర్గాల ప్రజల కోసం ఒక తమ్ముడిగా, అన్నగా అండగా నిలుబడతా’ అని భరోసా ఇచ్చారు. 70 ఏండ్ల పాటు అధికారమిస్తే ‘మీరేం చేశారో’ చెప్పాలని ప్రతిపక్షాలను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
దళితులను ధనికులను చేసేందుకే దళితబంధు
అత్యంత నిరుపేదలుగా ఉన్న దళితులను ధనికులను చేయాలన్న ఉద్దేశంతో దళితబంధుకు శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. ఈ పథకం కింద లబ్ధిపొందిన వారు వివిధ పరిశ్రమలు పెట్టుకొని పది మందికి ఉపాధి కల్పించడం చూసి గర్వపడుతున్నానని అన్నారు. ఈ పథకం అమలు చేసి న తర్వాత బీసీ వర్గాల నుంచి కూడా సహాయం చేయాలన్న డిమాండ్ వచ్చిందని చెప్పారు. బీసీలలో అత్యంత వెనుకబడిన వర్గాలు (ఎంబీసీ) ఉన్నారని, చేతివృత్తులు, కులవృత్తులపై ఆధారపడ్డ వారిని ఆదుకోవాలని సీఎం ఆలోచన చేశారని తెలిపారు. అన్ని వర్గాల పేదలకు లాభం జరగాలని, ప్రభుత్వ పరంగా సహాయం చేయాలని కుల వృత్తుల వారికి రూ.లక్ష సాయం చేసే పథకాన్ని ప్రవేశపెట్టినట్టు చెప్పారు.
ఎంబీసీ సామాజికవర్గంలోని 14 కులవృత్తులు, చేతివృత్తుల వా ళ్లను దరఖాస్తు చేసుకోవాలని కోరినట్టు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దరఖాస్తు చేసుకున్న పదివేల మందికి దశలవారీగా రూ.లక్ష అందిస్తామని చెప్పారు. తొలివిడతగా 600 మం దికి చెక్కులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ పథకం నిరంతరం ప్రక్రియ అన్నారు. ఏ పేద వర్గాన్నీ వదలి పెట్టకుండా బాగు చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని చెప్పారు. ఆడబిడ్డ పెండ్లికి రూ.లక్షా 116లు కట్నంగా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని, ఇప్పటివరకు 12 లక్షల మంది సహాయం అందించామని తెలిపారు.