Minister KTR | హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): అనేక ప్రజాస్వామ్య పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ తొమ్మిదేండ్లలోనే వందేండ్ల అభివృద్ధి సాధించిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తలసరి ఆదాయం, జీఎస్డీపీలో దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతున్నదని అన్నారు. శుక్రవారం పంజాబ్‌లోని మొహాలీలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) క్యాంపస్‌లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ (ఏఎమ్పీపీపీ) కోర్సు ప్రారంభానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పరిపాలనలో, ప్రభుత్వ పాలసీల నిర్మాణంలో ఇన్నోవేషన్ తీసుకొచ్చిన రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఇందుకు టీఎస్ఐపాస్ అద్భుత నిదర్శనమని వెల్లడించారు. ఇది 50 మిలియన్ డాలర్ల పెట్టుబడులు తీసుకొచ్చి, 24 లక్షల ఉపాధి అవకాశాలను అందించిన గొప్ప విధానమని వివరించారు.
ఐటీ ఉద్యోగాల సృష్టిలో నం.1
దేశంలో ఐటీ ఉద్యోగాల సృష్టిలో హైదరాబాద్ నంబర్ వన్ స్థానానికి ఎదిగిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక ఐటీ ఉద్యోగాలు సంఖ్య 300 శాతం పెరిగిందని, ఐటీ ఎగుమతుల పరిమాణం 400 శాతం పెరిగిందని తెలిపారు. పరిశ్రమలు, పాలసీలకే కాకుండా ప్రాజెక్టుల నిర్మాణంలోనూ తెలంగాణ రికార్డులు సృష్టించిందని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ పంచ విప్లవాలను సృష్టిస్తున్నదని తెలిపారు. వీటి సహాయంతో రాబోయే కాలంలో రైతుల ఆదాయం అనేక రెట్లు పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అత్యధిక యూఎస్ఎఫ్డీఏ అనుమతులు కలిగిన ప్రాంతం తెలంగాణ అని స్పష్టం చేశారు. ఇక, రాష్ర్టాల్లో జరిగే మంచిని కేంద్ర ప్రభుత్వం స్వీకరించాలని, అప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని నొక్కి చెప్పారు. అయితే, దురదృష్టవశాత్తు దేశంలో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌కు ఉన్న విజన్, పాలనాదక్షత మరెవరికైనా ఉండి ఉంటే దేశం మరోలా ఉండేదని తేల్చి చెప్పారు. గత దశాబ్ద కాలంలో తెలంగాణలా ఇతర రాష్ట్రాలు, దేశం ప్రగతి పథంలో ముందుకెళితే ఇప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా మారేదని పేర్కొన్నారు. కాగా, మతపరమైన ఉద్రిక్తతలు నెలకొంటున్న నేపథ్యంలో శాంతిభద్రతలు కాపాడటం భవిష్యత్తులో అన్ని ప్రభుత్వాలకు పెద్ద సవాలు కాబోతున్నదని తెలిపారు.
ఎన్నికల్లో గెలుపు యూపీఎస్సీ కంటే కఠినం
రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన తనకు తెలంగాణ ఉద్యమం వల్ల ప్రజాక్షేత్రంలో క్షేత్రస్థాయిలో పనిచేసే అవకాశం దొరికిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. యువతను ప్రోత్సహించాలని తమ అధినేత కేసీఆర్ నిర్ణయించుకున్నారని, అందులో భాగంగానే తనతోపాటు మరికొందరికి గొప్ప అవకాశం దక్కిందని వివరించారు. ‘గువ్వల బాలరాజు.. మా ఎమ్మెల్యే. విప్ కూడా. ఆయన తండ్రి చిన్న కంపెనీలో పనిచేసేవారు. కానీ, తెలంగాణ ఉద్యమం, ప్రజాక్షేత్రంలో ఆయన పనితీరు వాళ్లింట్లో తొలితరం రాజకీయ నేతను చేసింది. తెలంగాణలో ఇలాంటి నేతలెందరినో కేసీఆర్ తయారు చేశారు. దేశమంతా ఇటువంటి పరిస్థితి రావాలి. కొత్తతరం వచ్చి కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకురావాలి. అయితే, ఎన్నికల్లో గెలవటం యూపీఎస్సీ పరీక్ష రాసిన దానికన్నా కఠినమైనది’ అని పేర్కొన్నారు.
కేటీఆర్ ప్రసంగానికి విశేష స్పందన
ఐఎస్బీలో మంత్రి కేటీఆర్ ప్రసంగానికి విశేష స్పందన లభించింది. ఈ కోర్సులో చేరిన వివిధ రాష్ట్రాలకు చెందిన సీనియర్ ప్రభుత్వాధికారులు, ఐఏఎస్, ఐపీఎస్, ఆలిండియా సర్వీసులో పనిచేస్తున్న పలువురు.. మంత్రి కేటీఆర్‌తో ప్రత్యేకంగా సంభాషించారు. ఆయన అభిప్రాయాలు, ప్రసంగంపై ప్రశంసలు కురిపించారు. మంత్రి ప్రసంగం తర్వాత ప్రొఫెసర్ అశ్వినీతోపాటు మిగిలిన ప్రొఫెసర్లు వ్యక్తిగతంగా అనేక అంశాలపై మంత్రితో విపులంగా చర్చించారు. వివిధ రాష్ట్రాలు, వివిధ రంగాలకు చెందిన ఐఎస్బీ విద్యార్థులు మంత్రితో ప్రత్యేకంగా ఫొటోలు తీసుకున్నారు.