హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని రంగాల్లో బహుముఖమైన అభివృద్ధి జరుగుతోందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పాత, కొత్త నగరం అనే తేడా లేకుండా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. మలక్‌పేట నియోజకవర్గంలోని పిల్లిగుడిసెలు బస్తీలో నూతనంగా నిర్మించిన 288 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగింస్తూ.. డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఆయా ప్రతిపాదనలతో స్థానిక ఎమ్మెల్యే బలాల ఎన్నోసార్లు సీఎం కేసీఆర్‌ను కలిసి విన్నవించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, రహదారుల విస్తరణ, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వీటన్నింటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. జంగంమెట్, బండ్లగూడ, ఫారూఖ్‌నగర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం వేగవంతం చేసి పేద ప్రజలకు అందజేస్తామన్నారు. పిల్లిగుడిసెల బస్తీలో ఒకప్పుడు మంచినీళ్ల గోస ఉండేది. డ్రైనేజీ సరిగా లేక ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ చౌరస్తాలో ఒక వేళ ప్రయివేటు బిల్డర్ ఇల్లు కట్టి ఉంటే.. ఒక్కో ఇల్లు రూ. 50 నుంచి రూ. 60 లక్షల వరకు ఖరీదు చేసి ఉండేవి. కానీ సీఎం కేసీఆర్ నిరుపేద ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ఉచితంగా ఇండ్లు కట్టించి ఇస్తున్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా.. పనులు చేస్తున్నాం. ఇది ఇల్లు కాదు.. పేద వాడి ఆత్మగౌరవానికి ప్రతీక. సర్వహంగులతో ఈ ఇండ్లను నిర్మించాం. 19 షాపులను ఏర్పాటు చేశాం అని కేటీఆర్ తెలిపారు.
చంచల్‌గూడ జైలును ఇక్కడి నుంచి తరలించాలని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఓవైసీ విజ్ఞప్తి చేశారు అని కేటీఆర్ తెలిపారు. 34 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చంచల్‌గూడ జైలును తరలించి.. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇండ్లు కానీ, ఐటీ పార్కు కానీ, విద్యాసంస్థలు కానీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనక్కిపోదు అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఉస్మానియా ఆస్పత్రికి కొత్త బిల్డింగ్ కట్టాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. 70 ఏండ్లలో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ మాత్రమే కట్టారు. కానీ కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఆస్పత్రులను బలోపేతం చేశామన్నారు. నగరంలో నాలుగు టిమ్స్ ను నిర్మించబోతున్నారు. గచ్చిబౌలిలో టిమ్స్‌ను ఏర్పాటు చేశారు. సనత్ నగర్, అల్వాల్, గడ్డి అన్నారంలో మరో మూడు టిమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మూడింటికి త్వరలోనే శంకుస్థాపన చేసి.. రాబోయే రెండు, మూడేండ్లలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఉస్మానియా ఆస్పత్రి శిథిలావస్థలో ఉన్న విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం అని కేటీఆర్ తెలిపారు.
Ministers @KTRTRS and @mahmoodalitrs inaugurated 288 units of 2 BHK Dignity Houses at Pilligudiselu, Saidabad, Hyderabad. MP @asadowaisi, MLA Ahmed Bin Abdullah Balala, Mayor @GadwalvijayaTRS, Dy Mayor @SrilathaMothe, and other dignitaries participated. pic.twitter.com/HuEcQgmTnC
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) August 28, 2021