Minister KTR | హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): కర్ణాటక మాడల్ అని కాంగ్రెస్ ఊదర గొడుతున్నది కానీ.. ఆ మాడల్తోనే తాము మునిగిపోయామని ఆ రాష్ట్ర రైతులు తెలంగాణకు వచ్చి చెప్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు విమర్శించారు. కర్ణాటక రైతులను డబ్బులిచ్చి తీసుకొస్తున్నారన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.‘ఒక పని చేద్దాం.. కర్ణాటకకే వెళదాం.. అక్కడి ఊళ్లలో తిరుగుదాం.. రైతులను అడుగుదాం.. ఒకటే బస్సులో అందరం కలిసి వెళదాం.. మళ్లీ తిరిగి వద్దాం. అక్కడి రైతులు చెప్పిన దాని ఆధారంగా ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుదాం. కర్ణాటక కరెంట్ కావాలో.. తెలంగాణ కరెంటు కావాలో ప్రజలే నిర్ణయిస్తారు’ అని కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు.
శనివారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలిచ్చా రు. ప్రగతి నివేదికతో ప్రజల ముందుకు వెళ్తున్నామని చెప్పారు. తెలంగాణను అప్పుల పా లు చేశారని కొందరు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అప్పు తెచ్చిన ప్రతి పైసాను తెలంగాణ ప్రగతి కోసమే ఖర్చు చేశామన్నారు. విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 7 వేల మెగావాట్ల నుంచి 26 వేల మెగావాట్లకు పెంచామ తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఐదు గంటల కరెంట్ ఇవ్వలేకపోతున్నదని విమర్శించారు. కర్ణాటక రైతులు తెలంగాణకు వచ్చి తమలాంటి తప్పు చేయొద్దని విన్నవిస్తున్నారని గుర్తుచేశారు.
ఒకప్పుడు తెలంగాణ ఎట్లుండేదో.. ఇప్పుడెట్లున్నదో తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూస్తే అర్థమవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ వచ్చినంక ఏం సాధించామని అడిగేవాళ్లకు.. దేశానికి దిక్సూచిగా మారామని, తెలంగాణ ఆచరిస్తే.. దేశం అనుసరించే స్థాయికి ఎదిగామని తెలంగాణ బిడ్డగా గర్వంగా చెప్పాలని సూచించారు. ‘సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య మాడల్ తెలంగాణది. తలసరి ఆదాయంలో మనమే నంబర్ వన్. జీఎస్డీపీలో దేశానికే ఆదర్శంగా ఎదిగాం. దేశంలో క్లిష్ట పరిస్థితులున్నా తెలంగాణలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. తెలంగాణలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన్ ఎవరైనా సరే అందరినీ సమభావంతో చూస్తున్నాం. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పినట్టు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం రాష్ట్రంలో విరాజిల్లుతున్నాయి. ఇక్కడ ఏం తినాలన్నా తినొచ్చు. ఏ బట్టలు కావాలన్నా వేసుకోవచ్చు. అనేక రాష్ర్టాల్లో ఇలాంటి పరిస్థితి లేదు. బీఫ్ తింటే, జై శ్రీరామ్ అనకుంటే, రైలులో వెళ్లేటప్పుడు గడ్డం, టోపీ ఉం టే దాడులు చేస్తున్నారు. ఇది దేనికి సంకేతం? అని ప్రశ్నించారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిన బీసీ నేతను తొలగించిన బీజేపీ, ఇప్పుడు బీసీని సీఎం చేస్తానంటే తెలంగాణ ప్రజలెవరూ నమ్మబోరని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ‘ఓబీసీ వర్గం నుంచి వచ్చిన ప్రధాని మోదీ.. ఆయన పాలనలో ఓబీసీలకు కనీసం మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదు. నాయకుడికి కావాల్సింది కులం కాదు.. గుణం. మోదీ ఇస్తానన్న ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? పేదల ఖాతాలో వేస్తానన్న రూ.15 లక్షలు ఎకడపోయాయి? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నారు. దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ చేస్తానన్నారు. పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామన్నారు. అవన్నీ ఏమయ్యాయి?’ అని ప్రశ్నించారు. ఓడిపోయే నియోజకవర్గాలను బీసీలకు కేటాయించిన బీజేపీ, వారి ఓటమిని కూడా బీసీ వర్గం మొత్తానికి ఆపాదిస్తుందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 110 స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలుం టే ఇప్పటికే బయటపడేవని, ఐదేండ్లలో లక్షల క్యూసెక్కుల వరదను ఆ బరాజ్‌లు తట్టుకొన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. మేడిగడ్డ బరా జ్ 28 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకుని నిలబడిందని గుర్తు చేశారు. పిల్లర్ కుంగుబాటుపై కేంద్ర డ్యామ్ సేఫ్టీ బృందం పర్యటిం చి విచారిస్తున్నదని, ఆ కమిటీ నివేదిక తర్వాత తగు చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ అం శంపై ప్రతిపక్షాల ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. ప్రతీకార రాజకీయాలు చేసే అలవాటు బీఆర్ఎస్కు లేదని, అలాంటి రాజకీయాలు చేస్తే రేవంత్ ఎప్పుడో జైలుకెళ్లేవాడని తెలిపారు. 50 ఏండ్ల పాలనలో మైనార్టీలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నాని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో మైనార్టీ వర్గాల అభ్యన్నతికి నిరంతరం కృషి చేసిందని చెప్పారు. కాంగ్రెస్ హ యాంలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు 10 ఉంటే, తాము 204కు పెంచామని చెప్పారు. మైనార్టీ సంక్షేమానికి ఏటా సగటున రూ. 1,000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు.
కాంగ్రెస్ పాలనతో తమకు పొంతన లేదని, ఆ పార్టీతో పోలిక అవసరమే లేదని స్పష్టంచేశారు. కాలుష్యరహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు వేస్తున్నామని, 2047 నాటికి రాష్ట్రంలో జీరో ఎమిషన్ లక్ష్యంగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తామని చెప్పారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల, మౌలిక వసతులకు పెద్ద పీట వేస్తున్నామని వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత పెట్రోలియం ఉత్పత్తులపై సుంకం పెంచలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. 2014 లో క్రూడాయిల్ ధరకు రూపాయి మాత్రమే పెరిగిందని, కానీ కేంద్రం అదనపు ఎక్సైజ్ డ్యూటీ, అదనపు సెస్‌ను విధించడంవల్లే పెట్రోలియం ధరలు తగ్గడం లేదని తెలిపారు. చమురు ఉత్పత్తులపై మోదీ ప్రభుత్వం ప్రజల నుంచి రూ.30 లక్షల కోట్లు కాజేసిందనే విషయంపై ఎలాంటి చర్చకైనా తాము సిద్ధమని ప్రకటించారు. పేదలకు లబ్ధి చేకూర్చడమే ల క్ష్యంగా 400లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించామని చెప్పారు.
హైదరాబాద్ రాష్ర్టాన్ని పరాధీనంలోకి నెట్టింది కాంగ్రెస్ అని కేటీఆర్ విమర్శించారు. 1956లో మనకు ఇష్టంలేకుండా ఆంధ్రతో కలిపి చారిత్రక తప్పు చేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ చేసిన తప్పు నుంచి బయట పడటానికి 58 ఏండ్లు పట్టిందని తెలిపారు. వందల మందిని చంపిన తర్వాత 2014లో రాష్ర్టాన్ని ఇచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీలో జగన్మోహన్రెడ్డి పార్టీ పెట్టడంతో అక్కడ ఎలాగూ కుప్పకూలిందని, కనీసం తెలంగాణలోనైనా నాలుగు సీట్లు వస్తాయనే ఆశతోనే కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చింది తప్ప తెలంగాణపై ప్రేమతో కాదని అన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలను సంపూర్ణంగా సాధించిన సీఎం కేసీఆర్
ప్రతినీటి చుక్కనూ ఒడిసి పట్టి మన భూములకు మళ్లించింది కేసీఆర్
ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్లిచ్చి మన దాహార్తిని తీర్చిన ముఖ్యమంత్రి
ఏడాదికి 13 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన ముఖ్యమంత్రి
మరో 90 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్న ముఖ్యమంత్రి
ఇవన్నీ ప్రజల ముందుంచి ఎన్నికలకు వెళ్తు న్నాం. ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంతగా ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. నియామకాల కోసం రానున్న రోజుల్లో ప్రత్యేక జాబ్ క్యాలెండర్‌తోపాటు, రిటైర్మెంట్ ఏడాదిలోనే కొత్త నియామకాలు చేపట్టేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. తమ హయాంలో 2.22 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన విషయాన్ని గుర్తించాలని, ప్రతిపక్షాల దిగజారుడు మాటలకు స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. దేశవ్యాప్తంగా ఏడాదిలో 4.5 లక్షల మందికి ఉద్యోగ కల్పన జరిగితే.. ఒక్క హైదరాబాద్ నుంచే 1.5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో 2.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టిందని, ఇప్పటికే 1.30 లక్షలు భర్తీ చేసిందని, మరో 90 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు.
తండాను పంచాయతీ చేసింది కేసీఆర్
6% రిజర్వేషన్‌ను 10% చేసింది కేసీఆర్
గిరిజనులకు పోడు పట్టాలిచ్చింది కేసీఆర్
దళితబంధు పథకం తెచ్చింది కేసీఆర్
రైతుబంధు ఆలోచన చేసింది కేసీఆర్
ప్రతి రైతుకు జీవిత బీమా
చేయించింది కేసీఆర్
యాదాద్రిని అద్భుతంగా మార్చింది కేసీఆర్
హైదరాబాద్‌ను ప్రపంచ వ్యాక్సిన్
రాజధానిగా చేసింది కేసీఆర్
వ్యవసాయ ఉత్పత్తుల్లో
అగ్రభాగాన నిలిపింది కేసీఆర్
ధాన్యం ఉత్పత్తిలో
నంబర్ వన్‌గా చేసింది కేసీఆర్
డాక్టర్ల ఉత్పత్తిలో
నంబర్ వన్‌గా నిలిపింది కేసీఆర్
ఇంటింటికీ సన్నబియ్యం
ఇస్తామని చెప్తున్నది కేసీఆర్
మహిళకు రూ.3 వేల భృతి
ఇస్తామంటున్నది కేసీఆర్
పింఛన్లను రూ.5 వేలకు
పెంచుతామన్నది కేసీఆర్
రూ.400లకే గ్యాస్ బండను
ఇస్తామంటున్నది కేసీఆర్..
వీటన్నింటినీ ప్రజలు నమ్ముతున్నరు.
ఎందుకంటే కేసీఆర్ ట్రాక్‌రికార్డ్ అట్లాంటిది. చెబితే చేస్తారనే క్రెడిబులిటీ అట్లాంటిది అని మంత్రి కేటీఆర్ తెలిపారు.